పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం.. ఆమె భర్తకు తెలిసి..

30 Aug, 2022 07:21 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, హైదరాబాద్‌ (మేడ్చల్‌): వివాహిత మహిళతో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. ఆ మహిళ భర్త ఇద్దరు కొడుకులు కలిసి వ్యక్తిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. కీసర ఇన్‌స్పెక్టర్‌ రఘువీర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... యాదగిరిగుట్ట మండలం సైదాపూర్‌ గ్రామానికి చెందిన రుద్రబోయిన బాలరాజ్‌గౌడ్‌(36) నాలుగేళ్ల క్రితం సొంత గ్రామం నుంచి భార్య మమత ఇద్దరు పిల్లలతో వ్యాపార రీత్యా ఉప్పల్‌లో ఉంటున్నాడు. రియల్‌ ఎస్టేట్‌తో పాటు మద్యం వ్యాపారం చేస్తున్నాడు. వీరి ఇంటి పక్కనే ఉండే రమేష్‌ భార్య మంజులతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. 

మొదటి సారి హెచ్చరించి దాడి.. 
విషయం తెలియడంతో మంజుల భర్త రమేష్‌ పలుమార్లు బాల్‌రాజ్‌గౌడ్‌ను హెచ్చరించాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో రమేష్‌ ఒకసారి బాలరాజ్‌గౌడ్‌పై దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టాడు. 

సదరు మహిళను తీసుకొని వెళ్లిపోయిన బాలరాజ్‌గౌడ్‌  
బాలరాజ్‌గౌడ్‌ వ్యవహారం నచ్చక అతడి భార్య మమత ఇద్దరు పిల్లలను తీసుకొని అమ్మగారింటికి వెళ్లిపోయింది. బాలరాజ్‌గౌడ్‌ మంజులను తీసుకొని వెళ్లిపోయి కొన్ని రోజలు మేడ్చల్‌లో ఉన్నారు. ఆ తర్వాత కీసర మండలం గోధుమకుంట మైత్రినగర్‌లో ఓ ఇంటినిఅద్దెకు తీసుకొని ఉంటున్నారు.  

చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్‌ విద్యార్థితో జంప్‌)

ఆచూకీ తెలియడంతో ఆదివారం రాత్రి... 
వీరున్న ఆచూకి తెలుసుకున్న రమేష్‌ ఎలాగైనా బాలరాజ్‌గౌడ్‌ను హతమార్చాలని పథకం వేశాడు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఓ ఆటోలో తన ఇద్దరు కొడుకులు అరుణ్, తరుణ్‌తో పాటు మంజుల ఇద్దరు సోదరులతో కలిసి బాల్‌రాజ్‌గౌడ్‌ అద్దెకు ఉండే ఇంటికి వచ్చారు. 
కొద్దిసేపు బాలరాజ్‌గౌడ్‌తో వాగ్వాదానికి దిగారు. గొడవ తీవ్రమై కర్రతో పాటు ఇటుకతో బాలరాజ్‌గౌడ్‌ తలపై కొట్టారు. రమేష్‌ పెద్ద కొడుకు అరుణ్‌ బయట ఉండగా.. చిన్న కొడుకు తరుణ్‌ కలిసి అతను కింద పడిపోగానే పక్కనే ఉన్న బట్టతో ఊపిరి ఆడకుండా చేసి కత్తి, స్క్రూడ్రైవర్‌తో విచక్షణ రహితంగా పొడిచి చంపారు.  
అక్కడే ఉన్న మంజుల వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న బాలరాజ్‌గౌడ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మంజులతో పాటు ఆమె భర్త రమేష్, ఇద్దరు కుమారులు, మంజుల సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రఘువీర్‌రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు