కూతురికి ఉరేసి చంపి, తాను కూడా

4 Sep, 2020 14:36 IST|Sakshi
చనిపోవడానికి కొంతసేపు ముందు సెల్ఫీ వీడియోలో గణేష్, కార్తీక, గణేష్, అతని భార్య, కుమార్తె (ఫైల్‌) 

విచ్చలవిడి మనస్తత్వం.. జల్సాలకు మరిగిన స్వభావం.. డబ్బుపై మితిమీరిన వ్యామోహం.. కట్టుకున్న వాడినే బలితీసుకుంది. కన్నబిడ్డ ఉసురు తీసేసింది. ఓ వివాహిత విశృంఖల జీవితానికి అలవాటు పడింది. భర్త కళ్లుగప్పి చాటుమాటు వ్యవహారాలు నడిపింది. గుట్టు రట్టయినా పట్టించుకోలేదు. పెనిమిటి చెప్పిన మాటలు తలకెక్కించుకోలేదు. చివరకు కడుపున పుట్టిన చిన్నారి వేధింపులకు గురవుతున్నా చలించలేదు. పచ్చటికాపురంలో నిప్పులు పోసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నోడు ప్రాణాలు తీసుకునే దాకా తీసుకెళ్లింది.

సాక్షి, చిత్తూరు:  ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యే చాటుమాటు వ్యవహారం నడుపుతుండడం.. ఆమె కోసం వచ్చేవాళ్లు ఇంట్లో చిన్న పాప పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడాన్ని తట్టుకోలేకపోయాడో భర్త. చెప్పుకుంటే పరువుపోతుందని కూతుర్ని ఉరేసి చంపి, ఆపై తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు నగరంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, సీఐ యుగంధర్‌ వివరాలను వెల్లడించారు. చిత్తూరు  ప్రశాంత్‌నగర్‌కు చెందిన గణేష్‌ (31) ఐదేళ్ల క్రితం చెన్నైలోని  కొరియర్‌లో పనిచేసేవాడు. ఫేస్‌బుక్‌ ద్వారా చెన్నైలోని సుధాకర్, రాజ్యలక్ష్మి రెండో కుమార్తె దివ్య (26)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ 2014లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఏడాదికి వారికి ఓ పాప పుట్టింది. పెళ్లయిన మూడేళ్లపాటు గణేష్‌ చెన్నైలోని అత్తమామ ఇంట్లోనే ఉంటూ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు.

ఈ క్రమంలో దివ్య చెన్నైకి చెందిన ధన, ప్రిన్స్‌ అనే వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఓసారి డబ్బుకోసం ధన అనే వ్యక్తిని తన తల్లి ఇంటికే దొంగతనానికి పంపింది. దొంగతనం చేస్తుండగా దొరికిపోయిన ధన.. రాజ్యలక్ష్మిని గొంతునులిమి చంపబోయాడు. వెంటనే తనచేయి కోసుకున్న దివ్య.. ధనను తప్పించింది. విషయం అందరికీ తెలియడంతో భార్యను తీసుకొచ్చి చిత్తూరులో కాపురం పెట్టాడు గణేష్‌. కానీ ఇక్కడకు వచ్చాక బెంగళూరుకు చెందిన మరో ఇద్దరితో సంబంధం పెట్టుకుంది. దివ్యకోసం ఇంటికి వచ్చేవాళ్లు.. నాలుగన్నరేళ్ల పాప కార్తీక పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారని గణేష్‌ గ్రహించాడు. దీనిపై గట్టిగా నిలదీయడంతో అతనిపై వరకట్న వేధింపుల కింద కేసు పెట్టింది. విషయాన్ని దివ్య తల్లి, అక్కకు చెప్పడంతో వాళ్లు కూడా గణేష్‌కు మద్దతుగా నిలిచి కార్తీకను  అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఇంతలో గురువారం సాయంత్రం తన ద్విచక్రవాహనంలో కార్తీకను తీసుకుని రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న ఓ లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నాడు. తన భార్యకు ఉన్న అక్రమసంబంధాలు, తనపై పెట్టిన తప్పుడు కేసు విచారణలో మనుషుల్ని పెట్టి బెదిరించడం, తన కూతురిపట్ల దివ్య కోసం వచ్చేవాళ్లు ప్రవర్తించిన తీరు మొత్తాన్ని ఓ సెల్ఫీ వీడియోగా తీసుకున్నాడు.

తాను, తన కుమార్తె కార్తీక ఇద్దరూ చనిపోతున్నామని వీడియోలో పేర్కొంటూ స్నేహితులకు పంపాడు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో వీడియోను చూసిన స్నేహితులు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ యుగంధర్‌ ఆధ్వర్యంలో పోలీసులు రైల్వే స్టేషన్‌ సమీపంలోని లాడ్జీలో గణేష్‌ పేరిట ఉన్న గదిని గుర్తించి రాత్రి 12.30 గంటల ప్రాంతంలో తలుపులు పగులగొట్టారు. అప్పటికే ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతున్న గణేష్‌ మృతదేహాన్ని గుర్తించారు. పాపకోసం వెతకగా.. బాత్‌రూమ్‌లోని కిటీకీ అద్దాలు తీసేసి.. దానికి ఓ తాడుకట్టి పాప గొంతుకు బిగించి ఉంది.  మృతదేహం వేలాడుతుండడాన్ని చూసిన పోలీసులు సైతం భావోద్వేగానికి గురయ్యారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గణేష్‌ భార్య దివ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన భర్త సుధాకర్‌ సైతం నాలుగేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడని, దీనికి కూడా దివ్యే కారణమంటూ ఆమె తల్లి పోలీసులకు తెలిపారు. దివ్య విచ్చలవిడితనం, జల్సాలు, డబ్బుపై వ్యామోహమే గణేష్, కార్తీకను బలిగొందన్నారు.   

మరిన్ని వార్తలు