పిల్లలు చూస్తుండగానే భార్య గొంతు కోసి...

21 Aug, 2022 11:16 IST|Sakshi

సాక్షి , హైదరాబాద్‌: భార్యను  అర్ధరాత్రి  కన్నకొడుకు , కూతురు చూస్తుండగానే  గొంతు కోసి దారుణంగా హతమార్చిన సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో  శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా, రామగుండం ఎన్‌టీపీసీ ప్రాంతానికి చెందిన కంది చంద్రయ్య కుమార్త పుస్తకాల దివ్య భారతి(32)కి అంబర్‌ పేట ప్రాంతానికి చెందిన  దీపక్‌ కుమార్‌తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

పెళ్లి తర్వాత వీరు కుర్మానగర్‌లో కాపురం పెట్టారు. వీరికి ఇద్దరు సంతానం అనంత్‌ కుమార్‌(11), దీక్షిత(7) ఉన్నారు. కాగా దీపక్‌ కుమార్‌కు ఇంతకు ముందే పెళ్లి జరిగింది. ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసిన విషయాన్ని గోప్యంగా ఉంచి దివ్య భారతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. గత కొంత కాలంగా అతను అదనపు కట్నం తేవాలని భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. భర్త తోపాటు అత్త, ఆడపడచు, ఆడపడచు భర్త సైతం వేధింపులకు గురి చేసేవారు. దీంతో బాధితురాలు ఉప్పల్, మేడిపల్లి పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. పోలీసుల కౌన్సెలింగ్, పెద్దల అంగీకారంతో ఇద్దరు రాజీ కుదుర్చుకున్నారు.

మళ్లీ వేధింపులు  తీవ్రం కావడంతో దివ్యభారతి ఉప్పల్‌ పోలీసులను ఆశ్రయించింది. దీపక్‌ను పిలిపించిన పోలీసులు హెచ్చరించి  పంపారు. ఇటీవల మళ్లీ గొడవ జరగడంతో గత కొన్నాళ్లుగా దీపక్‌  ఇంటికి రావడం లేదు.  శుక్రవారం అర్ధరాత్రి ఇంటికి వచ్చిన దీపక్‌ భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో భార్యను ఇటుకతో తలపై బాదాడు. దీంతో ఆమె కుప్పకూలగానే కూరగాయల కోసే కత్తితో పిల్లలు చూస్తుండగానే గొంతు కోసి  పారిపోయాడు.

దీంతో భయాందోళకులోనైన పిల్లలు చుట్టు పక్కల వారికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసేసరికి దివ్య భారతి మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

(చదవండి: పెళ్లికి ముందే భార్యకు వివాహేతర సంబంధం!.. రెండుసార్లు హత్యాయత్నం.. చివరికి)

మరిన్ని వార్తలు