భార్య గొంతుకోసి హత్య 

23 Sep, 2022 01:38 IST|Sakshi
భర్త భాస్కర్‌తో కల్పన (ఫైల్‌)  

మద్యానికి బానిసైన భర్త.. తరచూ గొడవలు 

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఘటన  

దిక్కుతోచనిస్థితిలో ముగ్గురు ఆడపిల్లలు 

మహబూబాబాద్‌ రూరల్‌: మద్యానికి బానిసై విచక్షణ కోల్పోయిన ఓ భర్త మాంసం కోసే కత్తి తో భార్య గొంతుకోసి దారుణంగా చంపాడు. మహబూబాబాద్‌ అడ్వొకేట్స్‌ కాలనీ కట్టెలమండి సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ ఎడ్లపల్లి సతీష్, మృతురాలి బంధువులు తెలిపిన ప్రకారం.. మహబూబాబాద్‌లోని భవానినగర్‌ తండాకు చెందిన జాటోతు భాస్కర్, కల్పన (27).. 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.

వీరికి స్వరూప, రిషిత, వర్షిత  సంతానం. జిల్లా కేంద్రంలోని ఓ మాంసం దుకాణంలో భాస్కర్‌ గుమాస్తాగా పనిచేస్తుండగా, కల్పన పలువురి ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. భాస్కర్‌ మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఐదు రోజులుగా కల్పన తల్లిగారి ఇంటి వద్దే ఉంటోంది. గురువారం ఉదయం కల్పన అడ్వొకేట్స్‌ కాలనీలోని ఇళ్లలో పనికి వెళ్తుండగా.. రోడ్డుపై ఆమెతో భాస్కర్‌ ఘర్షణకు దిగాడు.

మద్యం మత్తులో ఉన్న భాస్కర్‌.. భార్య మెడలోని పుస్తెల తాడును తెంపి.. కత్తితో గొంతుకోసి పారిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కల్పన అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి తమ్ముడు మాలోతు చందు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. పిల్లలు పుట్టక ముందు వరకు మంచిగా ఉన్నారని, ఆ తర్వాత తరచూ కల్పనతో భాస్కర్‌ గొడవ పడుతుండేవాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

తాగడానికి డబ్బులు ఇవ్వమని అడుగుతూ, మద్యం తాగొచ్చి అసభ్యకరంగా దూషిస్తూ కొట్టేవాడని వెల్లడించాడు. కాగా, భార్యాభర్తల గొడవతో కొద్దిరోజులుగా కల్పన తల్లి వద్దే పిల్లలు ఉంటున్నారు. స్వరూప 8వ తరగతి, రిషిత ఆరో తరగతి, వర్షిత రెండో తరగతి చదువుతున్నారు. తల్లి చనిపోవడం.. తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేయనుండటంతో పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

మరిన్ని వార్తలు