విషాదం: బతుకు దెరువు కోసం వచ్చి.. మున్నేరువాగులో గల్లంతు..

18 Jun, 2021 11:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మహబూబాబాద్‌(వరంగల్‌) : మానుకోట జిల్లా కేంద్రం శివారులోని మున్నేరువాగులో పడి యువకుడు గల్లంతైన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని పోచమ్మమైదాన్‌ ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్‌ (30) బతుకుదెరువు కోసం మానుకోటకు వచ్చాడు. జిల్లా కేంద్రంలోని లక్ష్మి థియేటర్‌ వెనుక ప్రాంతంలో నివాసం ఉండే అమ్జద్‌ వద్ద మార్బుల్‌ బండలు పరిచే పని చేస్తున్నాడు. కాగా, గురువారం మధ్యాహ్నం సమీప బంధువులు అజీమ్, యాసిన్, ఇర్ఫాన్‌ మున్నేరువాగు చెక్‌ డ్యాం సమీపంలోకి చేరుకుని మద్యం సేవించారు.

అనంతరం ఇర్ఫాన్‌ ఈతకొడతానని చెప్పి మున్నేరువాగు నీటి ప్రవాహంలోకి వెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో యాసిన్‌ వాగులో దిగి వెతికాడు. ఆచూకి లభ్యంకాకపోవడంతో మరో మిత్రుడు మౌసిన్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పడతోపాటు, డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. దీంతో టౌన్‌ ఎస్‌హెచ్‌ఓ జూపల్లి వెంకటరత్నం, టౌన్‌ ఎస్సై గాలిబ్, రూరల్‌ ఎస్సై నగేష్, బ్లూ కోల్ట్స్‌ పీసీలు వీరన్న, విజయ్‌కుమార్, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులతోపాటు స్థానికులు మున్నేరువాగు నీటిలో ఇర్ఫాన్‌ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు ఇర్ఫాన్‌ ఆచూకీ లభ్యంకాలేదు. కాగా,  ఇర్ఫాన్‌కు భార్య, కుమార్తె ఉండగా ప్రస్తుతం ఆమె గర్భిణిగా ఉంది. 

చదవండి: లాక్‌ డౌన్‌ ఆసరా చేసుకుని .. బావమరిది.. దారి దోపిడీలు..

మరిన్ని వార్తలు