ఇప్పటివరకు లాటరీ, క్రెడిట్‌ కార్డ్‌ అప్‌గ్రేడ్‌లు.. తాజాగా రివర్స్‌ పేమెంట్‌ పేరుతో

18 Apr, 2022 08:16 IST|Sakshi

డబుల్‌ డబ్బు జమవుతుందని సైబర్‌ నేరగాళ్ల వల

క్యూఆర్‌ కోడ్‌తో బ్యాంక్‌ అకౌంట్‌ హ్యాక్‌

బాధితుడి ఖాతా నుంచి రూ.11.99 లక్షలు ఖాళీ

నగరంలో తరచూ వెలుగు చూస్తున్న ఘటనలు

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగి తన ఇల్లు అద్దెకు ఇస్తానని, నెలకు రూ.20 వేల కిరాయి అని ఓ వెబ్‌సైట్‌లో ప్రకటన పెట్టాడు. అనంతరం ఓ వ్యక్తి ఆయనకు కాల్‌ చేసి తన పేరు రణ్‌దీప్‌సింగ్‌ అని, తాను సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) అధికారి అని పరిచయం చేసుకున్నాడు. పుణే నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయిందని, తనకి ఇల్లు నచ్చిందని, అడ్వాన్స్‌ చెల్లిస్తానని తెలిపాడు. ఇక్కడే ఓ మెలిక పెట్టాడు. అది గుర్తించని ఐటీ ఉద్యోగి మోసపోయాడు. సీఐఎస్‌ఎఫ్‌లో రివర్స్‌ పేమెంట్‌ విధానం ఉంటుందని, తన ఖాతాకు ఒక రూపాయి బదిలీ చేస్తే వెంటనే సీఐఎస్‌ఎఫ్‌ విభాగానికి చెందిన బ్యాంక్‌ ఖాతా నుంచి రెట్టింపు సొమ్ము జమ అవుతుందని నమ్మించాడు.

దానిని నిర్ధారించుకోవాలంటే ఒక రూపాయి బదిలీ చేయాలని కోరాడు. సరే అని యజమాని ఒక రూపాయి బదిలీ చేయగానే.. వెంటనే రెండు రూపాయలు జమయ్యాయి. దీంతో ఇది నిజమేనని నమ్మిన సదరు ఇంటి యజమాని డెబిట్‌ కార్డ్‌ నుంచి 12 లావాదేవీల్లో రూ.11.99 లక్షలు సైబర్‌ నేరస్తుడి ఖాతాకు బదిలీ చేశాడు. కానీ.. ఎంతకీ రెట్టింపు సొమ్ము జమ కాకపోవటంతో తాను మోసపోయానని గ్రహించి లబోదిబోమన్నాడు. ఇప్పటివరకు లాటరీ వచ్చిందని, క్రెడిట్‌ కార్డ్‌ అప్‌గ్రేడ్‌ అని రకరకాల మోసాలు చేసిన సైబర్‌ నేరస్తులు.. తాజాగా రివర్స్‌ పేమెంట్‌ విధానంతో బురిడీ కొట్టిస్తున్నారు. ఇల్లు అద్దెకు తీసుకుంటామని చెప్పి, రివర్స్‌ పేమెంట్‌లో రెట్టింపు సొమ్ము జమ అవుతుందని ఆశ చూపించి మోసాలకు పాల్పడుతున్నారు. 
చదవండి: హైదరాబాద్‌లో విషాదం.. భర్త, మేనమామతో గొడవ.. న్యాయవాది ఆత్మహత్య

నిందితులు ఓ చోట, ఖాతాలు మరో చోట.. 
రివర్స్‌ పేమెంట్‌ మోసాలు ఎక్కువగా రాజస్థాన్‌లోని అల్వార్, భరత్‌పూర్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర, హరియాణాలోని నుహ్‌ జిల్లాల నుంచి జరుగుతున్నాయని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సైబర్‌ నేరస్తులు వినియోగించే సిమ్‌ కార్డ్‌లు, బ్యాంక్‌ ఖాతాలు అసోం, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలలోని చిరునామాలతో ఉంటున్నాయి. మోసాలకు పాల్పడేది మాత్రమే రాజస్థాన్, యూపీ, హరియాణా బార్డర్ల నుంచి చేస్తుంటారు. దీంతో నేరస్తులను ట్రాక్‌ చేయడం కష్టంగా మారిపోయిందని ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఐటీ ఉద్యోగులు, బ్యాంకింగ్‌ ప్రొఫెషనల్స్, ఉన్నతోద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. 

క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపుల కోసమే.. 
బాధితులను నమ్మించేందుకు సైబర్‌ నేరస్తులు ఒకట్రెండు సందర్భాలలో రెట్టింపు సొమ్ము జమ చేస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు బదిలీ కాగానే కామ్‌గా సైలెంటవుతున్నారు. ఎంతకీ రెట్టింపు డబ్బు జమ కాకపోవటంతో బాధితులు మోసపోయామని గ్రహించి.. చేసేదేమీలేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. క్యూఆర్‌ కోడ్‌ అనేది కేవలం చెల్లింపులు చేసే సాంకేతిక విధానమే తప్ప డబ్బులు స్వీకరించేది కాదు.

క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసే పేమెంట్‌ మాత్రమే చేయాలి. అంతేతప్ప స్కాన్‌ చేస్తే డబ్బులు జమ అవుతాయని ఎవరైనా చెబితే అది మోసమని గ్రహించాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు. చందానగర్‌లోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌ మేనేజర్, కూకట్‌పల్లికి చెందిన మరో ఐటీ ఉద్యోగి కూడా ఇదే తరహాలో సైబర్‌ నేరస్తుల చేతికి చిక్కారు. ఇంటి అద్దె చెల్లించేందుకు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయాలని చెప్పి ఖాతా నుంచి రూ.లక్షల్లో సొమ్ము పోగొట్టుకున్నారు.

మరిన్ని వార్తలు