చేపలు దొంగతనం చేశాడని ప్రాణం తీశారు

6 Jun, 2021 18:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గురుగ్రామ్‌: హర్యానాలో  దారుణం చోటుచేసుకుంది. చేపలు దొంగలించాడన్న కారణంతో ఆరుగురు యువకులు కలిసి ఒక వ్యక్తిని దారుణంగా చితకబాదారు. దీంతో తీవ్ర గాయాలపాలైన అతను ఆదివారం కన్నుమూశాడు.

వివరాలు.. హర్యానాలోని చందోల్‌ గ్రామానికి చెందిన అనిల్ తన స్నేహితుడు కాలే, బంధువు పవన్‌తో కలిసి శనివారం అర్థరాత్రి దాటాకా చాపర్‌ గ్రామానికి చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే అదే సమయంలో ఆ గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు వచ్చి ఈ సమయంలో చేపలు పట్టడం ఏంటని.. ఊరి అనుమతి లేకుండా ఎలా పట్టుకుంటారంటూ వారిని బెదిరించారు. దీంతో అనిల్‌తో అతని స్నేహితులు అక్కడినుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా.. ఆ యువకులు వారిని అడ్డగించారు. అనిల్‌తో పాటు ఉన్న కాలే, పవన్‌లు అక్కడినుంచి తప్పించుకోగా.. అనిల్‌ మాత్రం దొరికిపోయాడు.

ఈ నేపథ్యంలో అనిల్‌పై ఆ యువకులు కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత పక్కనే డంప్‌యార్డ్‌లో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా మరుసటిరోజు ఉదయం ఆ ఊరి గ్రామస్తులు డంప్‌యార్డ్‌ దగ్గర అనిల్‌ పడి ఉండడం చూసి  అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అనిల్‌ను దగ్గర్లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు అతన్ని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని అనిల్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అనిల్‌పై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి వారికోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు