కుక్క కరుస్తోంది.. యాక్షన్‌ ప్లీజ్‌

7 Jun, 2022 02:11 IST|Sakshi

కుక్క, యజమానిపై ఫిర్యాదు చేసిన బాధితుడు, కేసు నమోదు  

గూడూరు: ప్రేమతో పెంచుకుంటున్న కుక్క యజమానికే తంటాలు తెచ్చింది. మూడుసార్లు ఒకే వ్యక్తిని కరిచింది. దీంతో బాధితుడు ఆ కుక్కతోపాటు, యజమానిపైనా సోమవా రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరులో జరిగింది. బ్రాహ్మణపల్లికి చెందిన ధారావత్‌ పూల్యా నాయక్‌ గూడూరులోని వ్యవసాయ శాఖ కార్యాలయం దగ్గరున్న బియ్యం మిల్లుకు వచ్చేవాడు.

రెండు నెలల క్రితం వచ్చిన పూల్యానాయక్‌ను ఓ కుక్క కరిచింది. యాంటీ రేబిస్‌ ఇంజక్షన్‌ వేసుకుని ఇంటికి వెళ్లాడు. నెల క్రితం అతను అవసర నిమిత్తం ఏఓ కార్యాలయానికి రాగా అదే కుక్క మళ్లీ కరిచింది. ఆ సమయంలో ఆక్కడున్న వ్యక్తులు ఆ కుక్కను సమీపంలోని నూర్జాహానీ అనే మహిళ పెంచుకుంటుందని చెప్పారు. వెంటనే పూల్యా నాయక్‌ వెళ్లి ‘మీ పెంపుడు కుక్క నన్ను రెండు సార్లు కరిచింది.

కుక్క బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోండి’ అని చెప్పి వెళ్లాడు. వారం క్రితం పూల్యా నాయక్‌ మళ్లీ బియ్యం మిల్లుకు వచ్చాడు. మళ్లీ అదే కుక్క కరిచింది. వెంటనే అతను యజమానికి చెప్పగా, స్పందించలేదు. ఈసారి తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో ఆ కుక్కను చంపాలని అతని కుటుంబసభ్యులు జీపీ పాలకవర్గానికి ఫిర్యాదు చేశారు. ఆ తరువాత పూల్యా నాయక్‌ గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు, కుక్కకాటు నిజమని తేలడంతో యజమానిపై కేసు నమోదు చేశారు. ఆ తరువాత యజమానిని పిలిపించి అనారోగ్యానికి గురైన పుల్యానాయక్‌కు చికిత్స చేయించాలని చెప్పారు. 

మరిన్ని వార్తలు