భార్యతో విడాకులు.. ఆమె ఫ్రెండ్‌తో సాన్నిహిత్యం.. రవికిరణ్‌ అదృశ్యం.. కారణం అదేనా?

4 Apr, 2022 16:45 IST|Sakshi
నూతక్కి రవికిరణ్‌(ఫైల్‌)  

సాక్షి, తెనాలి(గుంటూరు): వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలం మూల్పూరుకు చెందిన నూతక్కి రవికిరణ్‌ అనే యువకుడి అదృశ్యం ఇప్పుడు మిస్టరీగా మారింది. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు, అతడు హత్యకు గురైనట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారని సమాచారం. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని, తెనాలిలోని ఓ రౌడీషీటరు, అతడి సహచరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మూల్పూరుకు చెందిన నూతక్కి రవికిరణ్‌ తెనాలిలోని ఓ ప్రైవేటు నెట్‌వర్క్‌లో టెక్నీషియన్‌గా చేస్తున్నాడు. గత నెల 20న అతడు అదృశ్యమయ్యాడు.

అప్పట్నుంచి తల్లిదండ్రులు రవికిరణ్‌ ఆచూకీ కోసం వెతికారు. ఫలితం లేకపోవడంతో గతనెల 26న అమృతలూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. రవికిరణ్‌ తెనాలిలో హత్యకు గురయ్యాడని వాళ్లు అనుమానించారు. అమృతలూరు పోలీసుల విచారణపైనా వారు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రవికిరణ్‌ తల్లి సువార్తమ్మ నుంచి స్టేట్‌మెంట్‌ను తీసుకుని హత్య కోణంలో దర్యాప్తుచేయసాగారు. రవికిరణ్‌ వివాహితుడు.

తెనాలిలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లో నర్సుగా పనిచేస్తున్న భార్యతో అతడికి విభేదాలొచ్చాయి. ఇద్దరూ విడిపోయారు. అదే నర్సింగ్‌హోమ్‌లో నర్సుగా చేస్తున్న భార్య స్నేహితురాలైన మరో యువతితో రవికిరణ్‌కు సాన్నిహిత్యం పెరిగింది. తెనాలికి చెందిన ఓ రౌడీషీటర్‌ ఆ యువతి ద్వారానే గతనెల 20న రవికిరణ్‌కు ఫోన్‌ చేయించి పిలిపించారని, ఆ తర్వాతే అతడు అదృశ్యమయ్యాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
చదవండి: తాగిన మత్తులో నోరు జారాడు.. మైకం నుంచి తేరుకునే లోపే..

తెనాలి యువతితో సంబంధమున్న రౌడీషీటర్‌ రవికిరణ్‌ను కొట్టటంతో అతడు చనిపోయాడని, శవాన్ని మాయం చేశారని చెబుతున్నారు. పోలీసులతోనూ ఇదే విషయం చెప్పారు. దీనిపై పోలీసులు రౌడీషీటరును, ఆ యువతిని, వారికి సహకరించిన మరికొందరినీ విచారిస్తున్నట్టు సమాచారం. ఫోన్‌ కాల్స్, వారు సంచరించిన ప్రదేశాలు దాదాపుగా ట్రేస్‌ అయ్యాయని, ఇక భౌతిక సాక్ష్యాల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఇదే విషయమై చుండూరు సీఐ కళ్యాణ్‌రాజ్‌ వివరణ కోరగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.  

మరిన్ని వార్తలు