పసిమొగ్గపై కిరాతకం

28 Jul, 2022 08:19 IST|Sakshi

బనశంకరి: గత పదేళ్లుగా నిరంతరం తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బెంగళూరు తూర్పువిభాగ మహిళా పోలీస్‌స్టేషన్‌లో 8 మందిపై కేసు నమోదుచేశారు. లైంగికదాడి, పోక్సో చట్టాల కింద అభియోగాలను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. బాలిక తండ్రి చర్చ్‌ ఫాదర్‌గా పనిచేస్తుంటాడు. ఆమెకు 6 ఏళ్ల వయసులో స్నేహితుని ఇంట్లో వదలిపెట్టాడు. 10 ఏళ్లు వయసులో స్నేహితుని కుమారుడు బాలికకు మొబైల్‌ ఫోన్లో అశ్లీల చిత్రాలు, వీడియోలు చూడాలని బలవంతం చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు.

మూడునాలుగేళ్లు దారుణం కొనసాగించాడు. అతని వేధింపులను తట్టుకోలేక బాలిక పాఠశాల ఉపాధ్యాయునికి మొరపెట్టుకుంది. ఆ ఉపాధ్యాయుడు, అతడి భార్య కలిసి యువకున్ని మందలించారు. అదే సమయంలో నీ గురించి అందరికీ చెబుతానని బెదిరించిన ఆ ఉపాధ్యాయుడు బాధిత బాలిక మీద రెండేళ్ల నుంచి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. తన స్నేహితురాలిపై కూడా లైంగికదాడికి పాల్పడ్డాడని, ఇది తెలిసి మరో 6 మంది తమపై దారుణానికి ఒడిగట్టారని బాలిక ఆరోపించింది. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.    

కామాంధ తండ్రికి జైలుశిక్ష 
బనశంకరి: కంటికి రెప్పలా బిడ్డను చూసుకోవాల్సిన తండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి అకృత్యానికి ఒడిగట్టాడు. ఆ కిరాతక తండ్రికి 20 ఏళ్ల కఠిన శిక్ష   విధిస్తూ బుధవారం మంగళూరు జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. విట్ల పేరువాయి గ్రామ నివాసి 2020 మార్చిలో మైనర్‌ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేరంపై విట్ల పోలీస్‌స్టేషన్‌లో  పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి కేఎం.రాధాకృష్ణ  దోషికి 20 ఏళ్ల కఠినశిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ తీర్పు           వెలువరించారు. 

(చదవండి: విశాఖ ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌)

మరిన్ని వార్తలు