మత్తు ఇచ్చి పనిమనిషిపై అత్యాచారం.. ఆపై వీడియో..

1 Feb, 2021 09:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వీడియో తీసిన మహిళ యజమాని

బాధిత మహిళకు బెదిరింపులు 

ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు 

సాక్షి, పాల్వంచ(ఖమ్మం): పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం జరిపారు. వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో ఆదివారం ఐదుగురిపై కేసు నమోదయింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని టీచర్స్‌ కాలనీకి చెందిన కాల్వ కళావతి ఇంట్లో ఓ మహిళ పనిమనిషిగా చేస్తోంది. జనవరి 13న కళావతి ఇంటికి సయ్యద్‌ హుస్సేన్, కాల్వ రామారావు, కాల్వ సుమతి, ఉబ్బన మాణిక్యం అనే వ్యక్తులు వచ్చారు. ఆ సమయంలో పనిమనిషి ఇంట్లో పనులు పూర్తి చేసుకుని వెళ్తుండగా.. టీ తాగాలని కళావతి సూచించింది. టీలో అప్పటికే మత్తు మందు కలిపారు. ఆ టీ తాగిన పనిమనిషి వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం పనిమనిషిపై సయ్యద్‌ హుస్సేన్‌ అత్యాచారం జరపగా, కళావతి వీడియో తీసింది. బాధితురాలు తేరుకున్న తర్వాత.. విషయం బయటకు చెబితే వీడియోలు ఇంటర్‌నెట్‌లో పెడతానని బెదిరించింది. రూ.5 లక్షలు ఇవ్వాలని కొన్ని రోజులుగా వేధిస్తోంది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ రతీష్‌ ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. అత్యాచారానికి పాల్పడిన సయ్యద్‌ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగతావారు పరారీలో ఉన్నట్లు సమాచారం.

గతంలో ఓ వ్యాపారినీ బెదిరించారు.. 
వీడియో తీసిన మహిళ గతంలో తన వలలో చిక్కుకున్న మార్కెట్‌ ఏరియాకు చెందిన ఓ వ్యాపారిని సైతం బెదిరించింది. ఇద్దరు చాటుమాటుగా కలిసిన వీడియో తన వద్ద ఉందని, రూ.10 లక్షలు ఇవ్వాలని, లేకుంటే సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తానని బెదిరింపులకు దిగింది. సదరు వ్యాపారి ఫిర్యాదు మేరకు గత సెప్టెంబర్‌ 20న కేసులు కూడా నమోదు చేశారు. వలపు వలలో మరికొందరు కూడా చిక్కుకున్నట్లు సదరు మహిళ సెల్‌ కాల్‌డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు.    

మరిన్ని వార్తలు