ప్రేమ పేరుతో మోసం.. బాలికకు మాయమాటలు చెప్పి..

20 Jul, 2021 11:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, దామెర (వరంగల్‌): వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండల పరిధి ఓ గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు తండ్రి లేడు తల్లితో కలిసి పూరి గుడిసెలో ఉంటున్న ఆ బాలికను ఓ వ్యక్తి ప్రేమపేరుతో మోసం చేసి వారం రోజుల క్రితం లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొందరు సెటిల్‌మెంట్‌ చేసి బాధిత కుటుంబం నోరు మూయించారని తెలుస్తోంది. ఆనోటా.. ఈనోటా విషయం బయటికి పొక్కింది. వాస్తవాలు వెలికితీయడానికి వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీసులు రంగంలోకి దిగారు.

జిల్లా బాలల సంరక్షణ విభాగం చైర్‌పర్సన్‌ వసుధ ఈ విషయాన్ని కలెక్టర్‌ హరిత దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మికి సోమవారం ఫిర్యాదు చేశారు. అయితే బాధితురాలితోపాటు ఆమె తల్లి జరిగిన సంఘటన గురించి నోరు విప్పకపోవడంతో మిగిలిన మార్గాల ద్వారా ఈ కేసు విచారణను ఓ కొలిక్కి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. బాధితులు తమ గ్రామపరిధి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారా.. లేదా అని తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను పరిశీలించాలని ఇప్పటికే ఓ ప్రత్యేక బృందానికి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.

ఒకవేళ బాధితులు స్టేషన్‌కు వచ్చినట్టుగా తేలితే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా నిందితుడి సెల్‌ఫోన్‌ కాల్‌డేటాతో పాటు పంచాయితీని సెటిల్‌మెంట్‌ చేసినట్లు ప్రచారం జరుగుతున్న ప్రజాప్రతినిధుల కాల్‌డేటాను కూడా ఈ బృందం పరిశీలించనున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. సంబంధిత స్టేషన్‌ విభాగాధిపతిని ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా అసలు బాధితులు పోలీస్‌స్టేషన్‌కే రాలేదని బదులిచ్చారు. 

హెచ్‌ఆర్‌సీ దృష్టికి కూడా..
ఈ కేసుపై ఓ పత్రికలో వచ్చిన కథనంతోపాటు ఆ గ్రామంలో పర్యటించిన సందర్భంలో స్థానికుల నుంచి సేకరించిన సమాచారాన్ని జతపరిచి బాలల సంరక్షణ కమిటీ సభ్యులు హెచ్‌ఆర్‌సీ దృష్టికి పంపారు. దీనిని సుమోటోగా తీసుకొని కేసు విచారించాలని కోరారు. 

మరిన్ని వార్తలు