ప్రియుడి మోజులో మహిళ దారుణం..

23 Apr, 2022 08:47 IST|Sakshi
మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతాన్ని చూపుతున్న నిందితులు (ఇన్‌సెట్లో) హత్యకు గురైన సుధాకర్‌ (ఫైల్‌)

భర్తను హత్య చేసిన భార్య 

రాళ్లతో కొట్టి చంపి.. శవాన్ని హంద్రీలో పూడ్చి 

నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి 

ఇద్దరు నిందితుల అరెస్ట్‌ 

సాక్షి, కర్నూలు(కోడుమూరు): ప్రియుడి మోజులో పడి ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే కడతేర్చింది. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం కోడుమూరు పట్టణంలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి కర్నూలు డీఎస్పీ కేవి.మహేష్‌ ఎదుట హాజరు పరిచారు. పట్టణంలోని హరిజన వాడకు చెందిన సుధాకర్‌(37), కల్లూరుకు చెందిన లక్ష్మికి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

సుధాకర్‌ కాంట్రాక్ట్‌ పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. అదే పని చేస్తున్న దస్తగిరి అనే వ్యక్తితో సుధాకర్‌ భార్య లక్ష్మికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం బయట పడటంతో పలుమార్లు భార్యను మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాకపోగా.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడు దస్తగిరితో కలసి సుధాకర్‌ను చంపేందుకు పథకం రూపొందించింది.

చదవండి👉🏾  హైదరాబాద్‌లో కొత్తరకం సెక్స్‌ రాకెట్‌ గుట్టురట్టు.. పోలీసులు సైతం షాక్‌

ఈ క్రమంలో ఈనెల 18వ తేదీ రాత్రి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపేసి ముళ్ల పొదల్లో పడేసి ఇంటికి చేరుకున్నారు. కాగా మృతదేహం   కనిపించకుండా మరుసటి  రోజు ఇద్దరు వెళ్లి మృతదేహాన్ని హంద్రీ నదిలో పూడ్చి పెట్టారు. కాగా రెండు రోజులుగా కుమారుడు కనిపించక పోవడంతో సుధాకర్‌ తండ్రి లక్ష్మన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. లక్ష్మి, దస్తగిరిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.

శవాన్ని పూడ్చి పెట్టిన ప్రాంతాన్ని నిందితులు శుక్రవారం చూపెట్టారు. కర్నూలు డీఎస్పీ కేవి.మహేష్, తహసీల్దార్‌ ఉమామహేశ్వరమ్మ, కోడుమూరు సీఐ శ్రీధర్, ఎస్‌ఐ విష్ణు నారాయణ సుధాకర్‌  సమక్షంలో శవాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. అనంతరం కుటుంబీకులకు అప్పగించడంతో అంత్యక్రియలు నిర్వహించారు. హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు