చెప్పకపోవడంలో ఆంతర్యమేంటి.. అసలేం జరిగింది?

26 Feb, 2021 14:29 IST|Sakshi

యువకుడి అనుమానాస్పద మృతి

స్నేహితులతో వెళ్లి.. విగతజీవిగా మారి.. 

తల్లడిల్లిన తల్లిదండ్రులు

పోలీసులకుఫిర్యాదు 

నందిగాం: రాజకీయ కక్షసాధింపో.... మరే ఇతర ఘర్షణ వల్లోగానీ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పిలిచిన వెంటనే నమ్మకంతో తమకు తోడు వచ్చాడన్న ఆ ఇద్దరు వ్యక్తులు కనికరం చూపకుండా విడిచిపెట్టి వెళ్లారు. పర్యవసానంగా నందిగాం మండలం కల్లాడ పంచాయతీ భర్తుపురానికి చెందిన బగాది నవీన్‌(22) అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఈ ఘటన బైరిబొడ్డపాడు జంక్షన్‌ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మన్మథరావు, నాగమ్మల ఏకైక కుమారుడు నవీన్‌ ఇంటర్మీడియెట్‌ వరకు చదువుకున్నాడు.

బుధవారం సాయంత్రం శ్రీకాకుళం నుంచి వస్తున్న గ్రామానికి చెందిన బగాది జానకీరాం తనని తీసుకెళ్లడానికి రావాల్సిందిగా బగాది జగన్నాయకులుకు ఫోన్‌ చేయడంతో ద్విచక్ర వాహనంపై నవీన్‌ను వెంటబెట్టుకుని టెక్కలి వెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అనంతరం ద్విచక్ర వాహనంపై బయలుదేరి మార్గమధ్యంలో బైరిబొడ్డపాడు జంక్షన్‌ వద్ద కాసేపు విశ్రమించారు.

అదేసమయంలో అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని విడిచిపెట్టి వారిద్దరు గ్రామానికి చేరుకున్నారు. గురువారం ఉదయం జంక్షన్‌ వద్ద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తండ్రి మన్మథరావు ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్సై సనపల బాలరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో రోదిస్తున్న తల్లి నాగమ్మను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు.

చెప్పకపోవడంలో ఆంతర్యం ఏమిటి?
మార్గమధ్యంలో అపస్మారక స్థితిలో ఉన్న నవీన్‌ గురించి గ్రామస్తులకుగానీ, తల్లిదండ్రులకుగానీ చెప్పలేదు. తమ కుమారుడు ఎక్కడని యువకులను మృతుడు తండ్రి ప్రశ్నించగా, ఎక్కడో పడుకుని ఉంటాడులే అని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. బైరిబొడ్డపాడు జంక్షన్‌ వద్ద బండి నిలిపి కేకలు వేసుకున్నట్లు అక్కడికి దగ్గర్లో పాకలో ఉంటున్న వారు విన్నారని తెలుస్తోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు గెలుపొందడంతో జీర్ణించుకోలేక హత్య చేశారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.  
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు