అనకాపల్లిలో దారుణం.. మేనకోడలిని ఖతం చేసేందుకు రూ. లక్ష సుపారీ

25 Apr, 2022 15:11 IST|Sakshi
నగేష్‌ దాడిలో గాయపడిన యువతి

సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యువతిపై కక్షకట్టిన మేనమామ మరో వ్యక్తికి సుపారీ ఇచ్చి ఆమెను అంతమొందించేందుకు ప్రయత్నించాడు. వివరాలు.. వి.మాడుగుల గ్రామం జగ్గన్న చావిడి వద్ద ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన నగేష్‌ అనే వ్యక్తి బ్లేడ్‌తో దాడి చేశాడు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్లిన సిద్ధ స్వాతి(19) అనే యువతిపై నిందితుడు బ్లేడుతో గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న స్వాతిని స్థానికులు వైద్యం కోసం మాడుగుల ఆసుపత్రికి తరలించారు. 

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే స్వాతిపై దాడి చేసినట్లు గుర్తించారు. యువతి మేనమామ కొండబాబు నగేష్‌ అనే వ్యక్తితో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ నగేష్‌ స్వాతిని బైక్‌తో ఢీకొట్టి గాయపర్చినట్లు పోలీసులు తెలిపారు. యువతిని చంపితే కొండబాబు లక్ష రూపాయలు ఇస్తానన్నాడని నగేష్‌ పోలీసుల ఎదుట అంగీకరించాడు. అయితే పోలీసులు గతంలో స్వాతి మేనమామకు కౌన్సిలింగ్‌ ఇచ్చినా అతని తీరులో మార్పు రాలేదు.
చదవండి: పుష్ప ఘటన మరువకముందే.. మరో భార్య ఘాతుకం

స్వాతిని పెళ్లి చేసుకుంటానని మేనమామ కొండబాబు ఆమె దగ్గరి నుంచి పెద్ద మొత్తంలో నగదు బంగారం తీసుకున్నాడు. అనంతరం పెళ్లి చేసుకోవాలని కోరగా ముఖం చాటేశాడు. అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో స్థానిక నగేష్‌తో దాడి చేయించాడు.

మరిన్ని వార్తలు