రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

26 Jul, 2021 13:24 IST|Sakshi
వినోద్‌(ఫైల్‌)

సాక్షి, కాగజ్‌నగర్‌(ఆదిలాబాద్‌): ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఈ ప్రమాదం కాగజ్‌నగర్‌ పట్టణంలోని జెడ్పీ పాఠశాల ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని బాలాజీనగర్‌ కాలనీకి చెందిన జె.వినోద్‌(31) సిర్పూర్‌ (టి)లోని బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి రాత్రి కాగజ్‌నగర్‌కు వస్తున్నారు. సిర్పూర్‌(టి)– కాగజ్‌నగర్‌ ప్రధాన రహదారి(జెడ్పీ స్కూల్‌ సమీపంలో) వద్ద ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం అతివేగంతో వచ్చి ఢీకొట్టింది.

దీంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న వినోద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు ఆసిఫాబాద్‌లోని ఎంపీడీపీవో కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. బాలాజీనగర్‌లోని శంకర్‌– సంగీత దంపతుల రెండవ కుమారుడు వినోద్‌ నిత్యం పేపర్‌ మిల్లు క్రీడా మైదానంలో క్రికెట్‌ ఆడేవాడని తోటి స్నేహితులు తెలిపారు. సిర్పూర్‌(టి)కి చెందిన బంధువుల అమ్మాయితో మూడు నెలల క్రితమే వినోద్‌కు నిశ్చితార్థం జరిగింది.

అయితే అనుహ్యంగా రోడ్డు ప్రమాదంలో ఇలా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో విషాదం నెలకొంది. మరికొద్ది రోజుల్లోనే పెళ్లి జరగనుండగా ఇలా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ డి.మోహన్‌ ప్రమాదస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బొలెరో వాహనాన్ని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెంకటేష్‌ వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు