-

చదివింది ఎనిమిదో తరగతి..డజను మంది మహిళలకు టోకరా

19 Dec, 2022 20:52 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎనిమిదో తరగతి చదివిన వ్యక్తి ఏకంగా డజను మంది మహిళలను మోసం చేసి లక్షల్లో డబ్బు కాజేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...వికాస్‌ గౌతమ్‌ అనే మధ్యప్రదేశ్‌లోని గాల్వియర్‌ నివాసి వికాస్‌ యాదవ్‌ అనే పేరుతో నకిలీ ఐపీఎస్‌ ఆఫీసర్‌గా ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌ ట్విట్టర్‌లలో ఐడీ క్రియేట్‌ చేశాడు.

ఆఖరికి ప్రోఫైల్‌ పోటో కూడా ఒక గవర్నమెంట్‌ కారు పక్కన నిలబడి తీసుకున్న ఫోటోను పెట్టడంతో పలువురు సులభంగా అతని చేతిలో మోసపోయారు. ఈ మేరకు ఢిల్లీలోని సంజయ్‌ గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక మహిళ వైద్యురాలు ఆన్‌లైన్‌లో అతడితో ఒక రోజు చాటింగ్‌ చేసింది. ఆ తర్వాత అతడిపై నమ్మకం ఏర్పడటంతో తన వివరాలన్ని చెప్పింది. దీన్నే అవకాశంగా ఉపయోగించుకుని ఏకంగా రూ. 25 వేలు బ్యాంకు నుంచి డ్రా చేశాడు. దీన్ని గమనించిన సదరు మహిళా డాక్టర్‌ ఆ వ్యక్తిని ఫ్రాడ్‌గా భావించి పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంది. ఐతే ఆ వ్యక్తి తాను ఐపీఎస్‌ ఆఫీసర్‌ అని చెప్పడంతో రాజకీయనాయకుల అండదండ ఉండి ఉంటుందని భావించి తొలుత వెనక్కు తగ్గింది. ఎట్టకేలకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వికాస్‌ గౌతమ్‌ అరెస్టు అయ్యాడు.

ఆ తర్వాత అతను విచారణలో డజను మంది మహిళల నుంచి లక్షల్లో డబ్బు కాజేసినట్టు తేలింది. అతను ఎనిమిదో తరగతి మాత్రమే చదివాడని, ఆ తర్వాత అతను ఇండస్ట్రీయల్‌ కోర్సు కూడా పూర్తి చేసినట్లు పోలీసులుల తెలిపారు. నిందితుడు వికాస్‌ ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో కూడా పనిచేసేవాడని తెలిపారు. అది సివిల్‌ కోచింగ్‌ సెంటర్‌లకు పేరుగాంచిన ప్రాంతం అని, అక్కడ కోచింగ్‌ తీసుకునే విద్యార్థులను చూసి ఈ నకిలీ ఐపీఎస్‌ ఆఫీసర్‌ అవతారం ఎత్తాడని చెప్పారు. పోలీసులు వికాస్‌ నేర చరిత్రను తిరగదోడారు. అతడు గతంలో ఉత్తప్రదేశ్‌, గాల్వియర్‌లలో పలు ఆరోపణలపై జైలుకు కూడా వెళ్లినట్లు తెలిపారు. 

(చదవండి: ప్రపంచంతో కనెక్ట్‌ అవ్వాలంటే..హిందీతోనే వర్క్‌ ఔట్‌ అవ్వదు! రాహుల్‌ కీలక వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు