ఆస్తి కోసం.. బిర్యానిలో నిద్రమాత్రలు కలిపి

26 Aug, 2021 20:42 IST|Sakshi
చికిత్స పొందుతున్న అఖిల్, మరోవిద్యార్థి

జమ్మలమడుగు రూరల్‌: మానవ సంబంధాలు రోజురోజుకు మంట గలుస్తున్నాయి. ఆస్తి కోసం మమతానురాగాలను మరిచి మానవ మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ వాటాకు వస్తాడోనని కిరాతకానికి ఒడిగట్టాడు మేనమామ. తన బావ మొదటి భార్య కుమారుడుని అంతమొందించాలని కుట్ర పన్నాడు. అతన్ని అడ్డు తొలగిస్తే యావదాస్తికి తన అక్క కుమారుడే వారసుడని భావించాడు. బిరియాని ప్యాకెట్టులో నిద్రమాత్రలు కలిపి హత్య చేసేందుకు కుట్ర పన్నాడు.  ఈ సంఘటన బుధవారం దేవగుడిలో చొటు చేసుకొంది. పట్టణ సీఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. జమ్మలమడుగు మండలం దేవగుడికి చెందిన సైలాస్‌కు 15 ఏళ్ల కిందట కనకమ్మతో వివాహం జరిగింది.

వీరికి అఖిల్‌ అనే కుమారుడు జన్మించాడు. కొన్నేళ్ల తర్వాత కనకమ్మ మృతి చెందింది. సైలాస్‌ పుష్పలత అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మొదటి భార్య కుమారుడు అఖిల్‌ జమ్మలమడుగు   ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు. సైలాస్‌కు రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఆస్తిలో అఖిల్‌ వాటాకు వస్తాడని పుష్పలత తమ్ముడు రమేష్‌   దుర్బుద్ధితో ఆలోచించాడు. ఎలాగైనా  అతన్ని అంతమొందించాలనుకున్నాడు.

బుధవారం పట్టణానికి వచ్చి బిరియాని పాకెట్టు కొనుగోలు చేశాడు. అందులో కొన్ని నిద్రమాత్రలు వేసి మరో వ్యక్తి చేతికి ఇచ్చాడు. ‘మీ తండ్రి పంపించాడని అఖిల్‌కు ఇవ్వమని’చెప్పాడు.  అఖిల్‌ తన స్నేహితులతో  కలిసి బిరియాని తిన్నారు. కాసేపైన తర్వాత ముగ్గురు కుప్పకూలిపోయారు.  గ్రహించిన అధ్యాపకులు, విద్యార్థులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ తెలియజేశారు.     

మరిన్ని వార్తలు