బిడ్డ కిడ్నాప్‌.. పట్టు వదలని తండ్రి, ఏకంగా 24 ఏళ్లు

13 Jul, 2021 13:44 IST|Sakshi

బీజింగ్‌: సాధారణంగా ఎక్కడైనా పిల్లలు తప్పిపోయినా, కిడ్నాప్‌కు గురైనా తల్లిదండ్రులు వారి కోసం నెలలు, ఏళ్ల తరబడి వెతికి చివరకు ఆశలు వదులుకుంటారు. కానీ చైనాలో మాత్రం ఓ తండ్రి త‌ప్పిపోయిన త‌న కుమారుడి కోసం 24 ఏళ్ల పాటు వెతికాడు. ఏకంగా సుమారు 5 ల‌క్షల కిలోమీట‌ర్లు ప్రయాణించాడు. ఏ దేవుడు కరుణించాడో చివరకు తన కుమారుడు ఆచూకీ లభించింది. వివరాలు.. చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్సుకు చెందిన గువా గాంగ్‌టాంగ్ కుమారుడు రెండేళ్ల వ‌య‌సులో కిడ్నాప్‌కు గురైయ్యాడు. ఈ సంఘటన 1997లో జరిగింది. అప్పటినుంచి తన బిడ్డకోసం దేశవ్యాప్తంగా వెతకడం ప్రారంభించాడు. కానీ ఆచూకీ లభించలేదు.. అయినా ఆశలు వదులుకోలేదు.

ఈ క్రమంలో గాంగ్‌టాంగ్ చాలా ఇబ్బందులు ఎదర్కొన్నాడు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలు పాలైన సంఘటలు ఉన్నాయి. గువా గాంగ్‌టాంగ్ క‌థ ఆధారంగా 2015లో ఓ సినిమా కూడా తీశారు. ఆ సినిమాలో హాంగ్‌కాంగ్ సూప‌ర్‌స్టార్ ఆండీ లువా న‌టించారు. ఆ సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది. అలా వెతుకుతుండగా దాదాపు 24 ఏళ్ల నిరీక్షణ తరువాత తన కూమరుడిని కలుసుకున్నాడు.

డీఎన్ఏ ప‌రీక్షల ఆధారంగా పిల్లవాడి ఆచూకీ గుర్తించిన‌ట్లు తాజాగా ప‌బ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వశాఖ పేర్కొన్నది. కాగా, ఈ కిడ్నాప్‌ ఘ‌ట‌న‌లో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. చైనాలో పిల్లల అపహరణలు ఎక్కువ‌గా జరగుతుంటాయి. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పిల్లలు కిడ్నాప్‌కు గురవుతూ ఉంటారు. అయితే బిడ్డ కోసం గువా గాంగ్‌టాంగ్ పట్టుదలను  అభినందిస్తూ సోషల్‌ మీడియోలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు