పెళ్లై ఐదునెలలు.. భార్య, అత్తామామలు దూషించారని..

17 Jul, 2021 14:45 IST|Sakshi
రవిలాల్‌(ఫైల్‌)

సాక్షి, నెక్కొండ(వరంగల్‌): అత్తామామలు, కట్టుకున్న భార్య అకారణంగా దూషించారని మనస్థాపానికి గురైన యువకుడు వివాహం జరిగిన ఐదు నెలలకే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దకొర్పోలు గ్రామ పరిధిలోని రేకుల తండాకు చెందిన బాదావత్‌ రవిలాల్‌(24)కు మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలోని భూపతిపేట గ్రామ పరిధిలోని చెరుకొమ్ముల తండాకు చెందిన మంజులతో గత ఐదు నెలల క్రితం వివాహం జరిగింది.

ఇటీవల అత్తారింట నిర్వహించిన ఓ పండుగకు రవిలాల్‌ వెళ్లాడు. అత్తారింట్లో ఉండగా భార్య, అత్తమామలు బానోతు బుజ్జి, బిక్కిన, గుగులోతు రమేష్‌ లంతా కలిసి రవిలాల్‌ను అకారణంగా దూషించి, అవమాన పరిచారు. దీంతో మనస్థాపానికి గురైన రవిలాల్‌ స్వగ్రామానికి వచ్చి ఈ నెల 15న ఇంట్లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.  

మరిన్ని వార్తలు