‘సోనీ క్షమించు! నీకు ఏం చేయలేకపోయా’ కన్నీటితో భర్త

3 Sep, 2021 07:59 IST|Sakshi

పురుగుల మందు తాగి వ్యాపారి ఆత్మహత్య

సెల్ఫీ వీడియోలో భార్య పిల్లలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం

ఇప్పించిన అప్పు, వడ్డీలు, డీసీసీబీ బ్యాంకు సిబ్బంది వేధింపులే కారణం

ఆదిలాబాద్‌లోని భుక్తాపూర్‌ కాలనీలో విషాదం

గుడిహత్నూర్‌ (బోథ్‌): ‘సోనీ.. నన్ను క్షమించు. నీకు, పిల్లలకు ఏం చేయలేక పోయాను. నువ్వు చాలా అమాయకురాలివి.. నీ సంతోషం కోసం ఎక్కడికి తీసుకెళ్లలేకపోయా.. బంగారం లాంటి నా పిల్లలను వీడి చనిపోతున్నా’ అంటూ ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన వ్యాపారి జక్కుల శ్రీనివాస్‌ (38) సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ‘అప్పులు, వడ్డీల మీద వడ్డీలు తీసుకుంటున్న వారిని దూషి స్తూ.. నా చావుతోనైనా వారికి కనువిప్పు కలగాలి’ అని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుడిహత్నూర్‌లో జరిగింది.

ఆదిలాబాద్‌లోని భుక్తాపూర్‌ కాలనీకి చెందిన జక్కుల శ్రీనివాస్‌ ఉస్మాస్‌ బిస్కెట్‌ ఏజెన్సీ నడిపిస్తూ ఉపాధి పొందుతున్నాడు. వ్యాపారంతోపాటు తనకు తెలిసిన వారికి ఇతరుల దగ్గరి నుంచి అప్పులు ఇప్పించాడు. శ్రీనివాస్‌ పూచికత్తుగా ఉండి అప్పులు ఇప్పించడంతో అప్పు తీసుకున్నవారు సకాలంలో చెల్లించకపోవడంతో ఇచ్చినవారికి శ్రీనివాస్‌ వడ్డీలు కూడా చెల్లించాడు. ఇలా ఇతరుల అప్పులు చెల్లిస్తూ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తన భార్య సోనిని జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్‌లో ఉండే అత్తవారింట్లో వదిలి పనిపై గుడిహత్నూర్‌ వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. మాన్కాపూర్‌ శివారులో పత్తి చేను వద్ద పురుగుల మందుతో వెళ్లిన శ్రీనివాస్‌ ముందుగా సెల్ఫీ వీడియో తీశాడు. భార్య సోని, కూతురు లక్ష్మీభవాని, కొడుకు దుర్గాప్రసాద్‌ను తలచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. (చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి)

తీసుకున్న అప్పులు, ఇప్పించి అప్పులు వాటికి తాను నెలనెలా కడుతున్న వడ్డీలు మానవత్వం లేకుండా అప్పులు ఇచ్చినవారు వేధిస్తున్న తీరును చెప్పుకొచ్చాడు. తన చావుకు అప్పులు వారు, డీసీబీ బ్యాంకు సిబ్బంది వేధింపులే కారణమని తెలిపాడు. గత్యంతరం లేక తాను ఆత్మహత్య చేసుకుని తన కుటుంబానికి దూరమవుతున్నానని అన్నాడు. కాగా, సాయంత్రం అయినా శ్రీనివాస్‌ ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు వాకబు చేస్తూ వెతికారు. గురువారం ఉదయం మాన్కాపూర్‌ శివారు పత్తి చేనులో శ్రీనివాస్‌ పురుగుల మందు తాగి విగత జీవిగా పడి ఉన్నాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

చదవండి: 8 మంది భర్తలను మోసగించి, తొమ్మిదో పెళ్లికి రెడీ.. ట్విస్ట్‌ ఏంటంటే!

మరిన్ని వార్తలు