పిచ్చోడి చేతికి ఫోన్‌.. మహిళా ఏఎస్సైకి అశ్లీల ఫోటోలు!

14 Dec, 2021 07:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,హైదరాబాద్‌: నగరంలో పని చేసే పోలీసు అధికారిణికి  సైబర్‌ వేధింపులు ఎదురయ్యాయి. కొన్నాళ్లుగా ఓ గుర్తుతెలియని వ్యక్తి అశ్లీల ఫొటోలు పంపుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడి కోసం కేరళకు వెళ్లిన అధికారులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. అరెస్టుకు అవకాశం లేకపోవడంతో నోటీసులు జారీ చేసి సరిపెట్టారు.

రాష్ట్ర మహిళ భద్రత విభాగంలో అసిస్టెంట్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌గా (ఏఎస్సై) ఓ అధికారిణికి కొన్ని రోజులుగా గుర్తుతెలియని ఫోన్‌ నంబర్‌ నుంచి వాట్సాప్‌ ద్వారా అశ్లీల ఫొటోలు, వీడియోలు వస్తున్నాయి. తొలినాళ్లల్లో యాదృచ్ఛికంగా జరిగిందని భావించిన ఆమె సందేశాలతోనే మందలించారు. అయినప్పటికీ ఈ వేధింపులు ఆగకపోవడంతో తీవ్రంగా పరిగణించారు. సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

సాధారణ మహిళలపై జరిగే నేరాలనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు. అలాంటిది ఓ పోలీసు అధికారిణే బాధితురాలిగా మారడంతో కేసు దర్యాప్తునకు ప్రాధాన్యం ఇచ్చారు. సాంకేతికంగా ముందుకు వెళ్లిన ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి నిందితుడు కేరళ రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి తీసుకురావాలనే ఉద్దేశంతో రెండు రోజుల క్రితం ప్రత్యేక బృందంతో బయలుదేరి అక్కడకు చేరుకున్నారు.

తిరువనంతపురం సమీపంలోని ఓ గ్రామంతో నిందితుడి ఆచూకీ కనిపెట్టిన ప్రత్యేక బృందం సోమవారం అతడిని అరెస్టు చేయాలని నిర్ణయించుకుంది. దీంతో నిందితుడు ఉండే ప్రాంతానికి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావు నేతృత్వంలోని బృందం చేరుకుంది. అక్కడ అతగాడి పరిస్థితి చూసిన నగర అధికారులు అవాక్కయ్యారు. మహిళ ఏఎస్సైకి అశ్లీల ఫొటోలు, వీడియోలు పంపుతున్న వ్యక్తి చిన్న గుడిసెలో నివసిస్తున్న మానసిక స్థితి సరిగ్గా లేదని గుర్తించారు.

దీనికి తోడు మూగ–చెవిటి వ్యక్తి కావడంతో కుటుంబీకులు సెకండ్‌ హ్యాండ్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చారు. అత్యవసర సమయంలో తమకు సంప్రదించడానికి ఇలా చేశారు. అయితే ఈ ఫోన్‌ను వినియోగించే సదరు నిందితుడు అనేక మందికి అశ్లీల ఫొటోలు, వీడియోలు పంపిస్తున్నాడని తేలింది.

అతడి ఫోన్‌ పరిశీలించిన అధికారులు అందులో అనేక ఫొటోలు, వీడియోలు గుర్తించారు. ఈ విషయం నిందితుడి కుటుంబీకులకు తెలిపారు. వారి సాయంతో ప్రశ్నించగా... తనకు మహిళ ఏఎస్సై ఎవరో తెలియదని, ఏదో ఒక ఫోన్‌ నెంబర్‌ ఎంపిక చేసుకుని ఇలా పంపిస్తుంటానని నిందితుడు చెప్పాడు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, లేదంటే అనేక సమస్యలు వస్తాయని కుటుంబీకులను పోలీసులు హెచ్చరించారు. నిందితుడిని అరెస్టు చేసే అవకాశం లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు.    

మరిన్ని వార్తలు