కూతురు, మనుమరాలిపై లైంగికదాడి.. జీవిత ఖైదు

27 Mar, 2021 17:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడిలా మారాడు. కన్న కూతురిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెకు పెళ్లైన తర్వాత కూడా వేధింపులకు గురిచేశాడు. అంతటితో అతడి క్రూర వాంఛ తీరలేదు. మైనర్‌ అయిన మనుమరాలిపై ఆ మృగాడి కన్నుపడింది. ఆమెపై కూడా అతడి అకృత్యాలు కొనసాగాయి. అయితే, బాలిక ఈ విషయాన్ని తల్లితో చెప్పడంతో, ఇక ఆమె సహించలేకపోయింది. తనతో పాటు తన బిడ్డను కూడా వేధిస్తున్న ఆ దుర్మార్గుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సోచట్టం కింద అతడిపై కేసు నమోదు చేయగా, విచారణ చేపట్టిన కోర్టు జీవిత ఖైదుతో పాటు 75 వేల రూపాయాల జరిమానా విధించింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

వివరాలు.. నిందితుడి(65) కుటుంబం ముంబైలో నివసిస్తోంది. అతడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. తండ్రీకొడుకులు పెయింట్లు వేస్తూ జీవనోపాధి పొందుతుండగా, తల్లీకూతుళ్లు నాలుగిళ్లలో పనిచేస్తూ వారికి చేదోడువాదోడుగా ఉండేవారు. ఈ క్రమంలో ఆ ఇంటి యజమానిలో దాగున్న కామ ప్రకోపం నిద్రలేచింది. దీంతో, పదిహేనేళ్ల వయసులో ఉన్న కూతురిపై తరచుగా అత్యాచారానికి పాల్పడుతుండేవాడు. ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిన తర్వాత కూడా వేధించసాగాడు. అంతేగాక ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే, ఆమె పిల్లలను చంపేస్తానని బెదిరించేవాడు. 

దీంతో బాధితురాలు మిన్నకుండిపోయింది. అయితే, తన కూతురిపై కూడా తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలియడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించింది. 2017 నాటికి సంబంధించిన ఈ కేసును విచారించిన ముంబై పోక్సో ప్రత్యేక కోర్టు.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అదే విధంగా కూతురికి రూ.50 వేలు, మనుమరాలికి రూ. 25 వేలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ రేఖా ఎన్‌ పంఢారే తీర్పు వెలువరించారు.

చదవండి: ఉద్యోగం పేరుతో ఆశ: బాలికను లక్ష రూపాయలకు..

మరిన్ని వార్తలు