కదిలిస్తే కన్నీళ్లే... పుట్టిన రోజు నాడే తండ్రి, స్నేహితుడితో కలిసి మృత్యు ఒడికి 

22 Sep, 2022 15:17 IST|Sakshi

చిత్తూరు కలెక్టరేట్‌/చిత్తూరు అర్బన్‌ :   మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. తండ్రి, స్నేహితుడితో కలిసి తన పుట్టిన రోజు జరుపుకుంటున్న యువకుడు అదే రోజు మృత్యుఒడిలోకి చేరుతాడని అనుకోలేదు. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను, కుమారుడిని వదిలిపెట్టి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని తన విద్యతో రూపుమాపడానికి విదేశాలకు వెళ్లాల్సిన యువకుడి ఆశ అడియాశలైపోయింది. చిత్తూరు నగరంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన భాస్కర్‌ (65), ఢిల్లీబాబు (35), బాలాజీ (24) కుటుంబ పరిస్థితులు చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు.   

అనుమతులేవీ..?  
ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఆ భవనంలో ఏడాదిన్నర కాలంగా భాస్కర్‌ పేపర్‌ ప్లేట్లను తయారుచేసే కుటీర పరిశ్రమను నడిపిస్తున్నారు. దీనికి అధికారుల నుంచి ఎలాంటి అనుమతుల్లేవు. తమిళనాడు నుంచి భారీ మొత్తంలో సరుకును తెప్పించి, ఇక్కడ చిన్నపాటి యంత్రంతో ఒత్తిడినిచ్చి పేపర్‌ ప్లేట్లకు రూపునిచ్చి తయారు చేస్తున్నారు. పైగా భవనం ఏళ్లక్రితం నిర్మించింది కావడంతో అగ్నిప్రమాదం జరిగితే బయటపడే ముందస్తు ప్రణాళికలు ఏవీ కనిపించలేదు. ఈ ఘటనలో మృతి చెందిన బాధితుల శరీరంపై ఒక్క గాయం కూడా లేదు.  వ్యాపించిన పొగకు ఊపిరి ఆడక ఆ ముగ్గురు మృతిచెందినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఆ భవనానికి రెండోవైపు దారి ఉండుంటే ప్రాణాలు పోయేవి కావని, ఒకేదారి ఉండడంతో మంటల్లో ప్రధాన దారి నుంచి లోనికి ప్రవేశించేందుకు కష్టతరం అయిందని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి తెలిపారు. 

కన్నీటి వీడ్కోలు ..: మృతుల్లో భాస్కర్‌కు ముగ్గురు సంతానం. కుమార్తెలు దీప్తి, దివ్య, కుమారుడు డిల్లీబాబు ఉన్నారు. దివ్య వివాహం చేసుకుని దుబాయ్‌లో ఉండగా,  తల్లి శమంతకమణిని మూడు నెలల క్రితం తనవద్దకు తీసుకెళ్లింది. తన తండ్రి, అన్న మరణవార్త వినగానే అర్థరాత్రి దుబాయ్‌ నుంచి హుటాహుటిన ఇక్కడికి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం చిత్తూరుకు చేరుకున్నారు. భాస్కర్, డిల్లీబాబుకు బంధువులు, మిత్రుల అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.  

పరామర్శ.. 
ఘటనపై కలెక్టర్‌ హరినారాయణన్, ఎస్పీ రిషాంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని చిత్తూరు ఆర్డీవో రేణుక, తహసీల్దారు పార్వతి, కమిషనర్‌ అరుణ పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. స్థానిక కార్పొరేటర్‌ నాజీరా, వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ అల్తాఫ్‌ ఇంకా స్థానికులు ప్రమాద ఘటనలో వేగంగా స్పందించినా.. వీళ్ల ప్రయత్నం ఫలించలేదు. ఇక మాజీ ఎమ్మెల్యే సీకే బాబు సైతం మృతుల కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు. 

ప్రమాద ఘడియలు ఇలా..  
మంగళవారం అర్ధరాత్రి 11 గంటలు : చిత్తూరు నగరంలోని 44 వ డివిజన్‌ రంగాచారి వీధిలో పేపర్‌ ప్లేట్లు తయారుచేసే ఇంట్లో ఢిల్లీబాబు, తన తండ్రి భాస్కర్, స్నేహితుడు బాలాజీతో కలిసి తన జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు.
రాత్రి 11.10 : అప్పటి వరకు సరదాగా ఉన్న ఇంట్లోని వంటగది నుంచి వైర్లు కాలే వాసన వస్తోంది. సున్నపు దిమ్మెలతో నిర్మించి ఆ ఇంట్లో వైర్లు అప్పుడప్పుడు షార్ట్‌ సర్క్యూట్‌ అవడం మామూలేనని ముగ్గురూ పట్టించుకోకుండా ఉండిపోయారు. కొద్ది నిముషాల్లోనే నిప్పు రవ్వలు అక్కడ నిల్వ చేసిన పేపర్‌ప్లేట్లపై పడటంతో మంటలు వ్యాపించాయి. 
►రాత్రి 11.14 : ఈ ఇంట్లో భారీ మొత్తంలో పేపర్‌ప్లేట్లను నిల్వ చేసి ఉంచడంతో క్షణాల్లో మంటలు భవనం మొత్తం అలముకున్నాయి. ఇదే సమయంలో దట్టమైన పొగ కమ్ముకోవడంతో అక్కడున్న ముగ్గురూ భయపడిపోయారు. బయటకు వెళ్లే మార్గంలో మంటలు వ్యాపించాయి. 
రాత్రి 11.15 : భాస్కర్‌ తన కుమార్తెకు చివరసారిగా ఫోన్‌ చేశాడు. ‘అమ్మా... ఇల్లు మొత్తం కాలిపోతా ఉంది. ఏమీ కనిపించలేదు. మీ అన్న కూడా నాతోనే ఉన్నాడు. బతుకుతామో లేదో తెలీదు...’ అంటుండగానే ఫోన్‌ కట్‌ అయిపోయింది. ముగ్గురూ ప్రాణభయంతో పరుగులుపెట్టి బాత్‌రూమ్‌లోకి వెళ్లిపోయారు. 
రాత్రి 11.17: రామ్‌నగర్‌ కాలనీకు చెందిన శ్రీకాంత్‌ అనే యువకుడు రంగాచారి వీధివైపు వెళుతూ భవనంలో మంటలుచూసి డయల్‌ –100కు ఫోన్‌ చేయడం, స్థానికులు అగ్నిమాపకశాఖకు సమాచారం ఇచ్చారు. బయటున్నవాళ్లు భవనంలో ఉన్నవారికి ఫోన్‌చేసినా ఫోన్‌ కలవలేదు. 
►రాత్రి 11.25 : ఒకదాని వెంట ఒకటి రెండు ఫైర్‌ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సిబ్బంది ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. పాకాల నుంచి మరో ఫైర్‌ ఇంజిన్‌ వచ్చింది. నీళ్లు అయిపోవడంతో మళ్లీ ఫైర్‌ ఇంజన్‌ వెళ్లి నీళ్లు నింపుకుని వచ్చింది. కార్పొరేషన్‌ ట్యాంకు నుంచి అదనంగా నీళ్లు తీసుకొచ్చారు. 
అర్థరాత్రి 12.45 : మంటలు స్వల్పంగా తగ్గడంతో ధైర్యం చేసిన అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సాయంతో ఇంటి పక్కనే ఉన్న గది షెటర్‌ తీసి లోపలకు వెళ్లారు. అక్కడున్న మరో కిటికీకి పగులగొట్టి గదుల్లో వెతికితే బాత్‌రూమ్‌లో భాస్కర్, ఢిల్లీబాబు, బాలాజీ విగత జీవులుగా పడున్నారు. వెంటనే అంబులెన్సులో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ముగ్గురూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.  

ఆశలు బుగ్గి పాలు  
ఘటనలో మృతి చెందిన డిల్లీబాబు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అతనికి ఏడాది వయసున్న బాబు (సాత్విక్‌) ఉన్నాడు. మంగళవారం ఢిల్లీబాబు పుట్టినరోజు కావడం, తన తండ్రి పక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో మృత్యువాత పడటం స్థానికుల్ని కలచివేసింది. 

డిగ్రీ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం 
మరో రెండు నెలల్లో విదేశాలకు వెళదామనుకున్న బాలాజి ఆశలు అగ్నికి ఆహుతయ్యాయి. తవణంపల్లి మండలం తెల్లగుండ్ల పల్లికి చెందిన కరుణాకర్, పార్వతి దంపతుల కుమారుడు బాలాజీ. కుటుంబంతో కలిసి మూడేళ్ల క్రితం చిత్తూరుకు వచ్చి, రంగాచారి వీధిలో బాడుగ ఇంట్లో ఉంటున్నాడు. బాలాజి తండ్రి గ్రానైట్‌ ఫ్యాక్టరీలో కూలీ పని చేస్తుండగా, తల్లి పార్వతి ఇంటి పని చేస్తూ కుటుంబాన్ని లాక్కొస్తోంది. భర్తకు అనారోగ్యంగా ఉండటం ఆ కుటుంబాన్ని కుంగదీస్తుంటే, కుమారుడ్ని విదేశాలకు పంపుతున్నామనే చిన్న సంతోషం వాళ్లకు పునర్జీవం పోస్తూ వచ్చింది. తీరా చెట్టంత కొడుకు తమను విడిచి శాశ్వతంగా వెళ్లిపోయాడని తెలుకున్న ఆ దంపతులకు కన్నీళ్లు తప్ప మరేమీ మిగల్లేదు. తెల్లగుండ్లపల్లిలోనే అంత్యక్రియలు నిర్వహించారు.   

మరిన్ని వార్తలు