దారుణం.. కత్తులతో పొడిచి చంపుతున్నా చూస్తూ ఉండిపోయారు!

2 Oct, 2022 11:20 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరం నడిబొడ్డున దారుణ ఘటన వెలుగు చూసింది. శనివారం సాయంత్రం సుందర్‌ నగరి ప్రాంతంలో ఓ యువకుడిని ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సాయంత్రం 7.40 గంటల సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కత్తి పోట్లతో తీవ్ర రక్తస్రావమై మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ దారుణానికి పాల్పడుతున్న సమయంలో ఆ పక్కనే పలువురు వ్యక్తులు ఉన్నా.. చీమకుట్టినట్లు కూడా స్పందించకపోవటం గమనార్హం. 

బాధితుడు సుందర్‌ నగరికి చెందిన మనీశ్‌గా గుర్తించారు. పాత పగలతోనే యువకుడిని హత్య చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు. ముగ్గురు రాక్షసులు కత్తులతో దారుణంగా పొడుస్తున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ముందు బాధితుడితో పాటు నిందితులు మాట్లాడుతూ వచ్చారు. ఆ కొద్ది సేపటికే అతడిపై దాడి చేసేందుకు యత్నించగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, ముగ్గురు ఉండటంతో వారి నుంచి తప్పించుకోలేకపోయాడు. పథకం ప్రకారం కత్తులతో వచ్చిన దుండగులు.. విచక్షణారహితంగా ఇష్టం వచ్చినట్లు పొడిచారు. కింద పడిపోయిన తర్వాత కూడా.. వెనక్కి తిరిగి వచ్చి మరీ పొడుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 

ఆ పక్కనే కొంత మంది కూర్చుని ఉన్నారు. ఒక వ్యాక్తిని దారుణంగా హత్య చేస్తున్నా.. వారిలో కొంచెం కూడా చలనం కలగలేదు. అలాగే.. చూస్తూ ఉండిపోయారు. ఈ పరిస్థితిని చూసిన పలువురు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మనిషన్నవాడు కనుమరుగవుతున్నాడని వాపోతున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు అలామ్‌, బిలాల్‌, ఫైజాన్‌లు సుందర్‌ నగరికి చెందినవారిగా గుర్తించామని, అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: ఫుట్‌బాల్‌ మైదానంలో తొక్కిసలాట.. 127 మంది దుర్మరణం

మరిన్ని వార్తలు