స్టేషన్‌కు వెళ్లి మరీ ట్రాఫిక్‌ ఎస్సైపై దాడి.. కత్తితో కడుపులో..

8 Aug, 2021 19:07 IST|Sakshi

భోపాల్‌: భోపాల్‌లో ఓ వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మరీ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసును కత్తితో కడుపులో పొడిచాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ‘‘నిందితుడు హర్ష్ మీనా శనివారం జ్యోతి టాకీస్‌కు వెళ్లాడు. అక్కడ అతను తన బైక్‌ను నో పార్కింగ్ జోన్‌లో పార్క్ చేశాడు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీరామ్ దూబే, నో పార్కింగ్ జోన్‌లో పార్క్ చేసిన వాహనాలను పోలీసు క్రేన్ సహాయంతో ఎత్తి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే సమాచారం అందుకున్న హర్ష్ మీనా క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. జరిమానా డబ్బులు రూ.600 చెల్లించడానికి ఇంటికి వెళ్లి వచ్చి డిపాజిట్ చేశాడు.

అదే సమయంలో పోలీస్ స్టేషన్ వద్ద క్రేన్ దగ్గర నిలబడి ఉన్న ఎస్‌ఐ శ్రీరామ్ దూబేని నిందితుడు చూశాడు. అతడి దగ్గరకు వెళ్లి ఎస్‌ఐను కత్తితో కడుపులో  పొడిచాడు. కాగా నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించడంతో.. క్రేన్‌ దగ్గర ఉన్న వ్యక్తులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.  అయితే జరిమానా డిపాజిట్ చేసిన తర్వాత నిందితుడు ట్రాఫిక్ పోలీసును పై కత్తితో ఎందుకు దాడి చేశాడనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అంతే కాకుండా విచారణ సమయంలో నిందితుడు పలు రకాల సమాధానాలు ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక నిందితుడు స్టేషన్‌లో సైకో లాగా ప్రవర్తించాడని, పెద్దగా నవ్వడం, అరవడం వంటివి చేశాడని పోలీసులు తెలిపారు. కాగా ఎస్‌ఐ దుబేను చికిత్స కోసం జేపీ ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్‌సీ రాజేష్ భదౌరియా తెలిపారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఎస్‌ఐని డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు