మృగంలా మారిన భర్త.. విడాకులు అడిగిన భార్యకు 30 కత్తిపోట్లు.. ‘మైండ్ బ్లాంక్ అయిందని..’

1 Aug, 2022 14:10 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా లాస్ వేగాస్‍లో ఓ వ్యక్తి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. విడాకులు కావాలని అడిగిన భార్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. కత్తితో 30 సార్లు పొడిచి కిరాతక చర్యకు పాల్పడ్డాడు. శనివారం ఈ ఘటన జరిగింది. నిందితుడు క్లిఫర్డ్ జాకబ్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపరుచనున్నారు.

భార్య వచ్చి విడాకులు కావాలని అడిగిన తర్వాత తన మైండ్ బ్లాంక్ అయిందని నిందితుడు చెప్పాడు. ఏం చేశానో కూడా  తనకు గుర్తులేదని పేర్కొన్నాడు. తాను మళ్లీ తేరుకునే సరికి ఆమె రక్తపుమడుగులో ఉన్నట్లు పోలీసులకు వివరించాడు.

నిందితుడి ఇంట్లో ఐదు కత్తులు, రక్తపు మరకలు ఉన్న కత్తెర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. క్లిఫర్డ్ తన భార్యను పొడిచానని, ఆమె చనిపోయిందేమోనని మాట్లాడటం విన్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.

ఈ ఘటనలో భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె మొహం, మెడపై కత్తిపోట్లున్నాయి. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు.

టెక్సాస్‌లో మే నెలలోనూ విడాకులు అడిగిందని ఉగ్రవాదిలా మారాడు ఓ భర్త. కోర్టు ఆవరణలోనే భార్య, కూతురు, అత్తను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చదవండి: ఆప్ కౌన్సిలర్‌ను అతి సమీపం నుంచి కాల్చి చంపిన దుండగుడు.. జిమ్ చేస్తుండగా దాడి..

మరిన్ని వార్తలు