ఇంటర్నెట్‌లో చూసి.. బైక్‌లు దొంగిలించి

21 Jul, 2021 07:48 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: వృత్తి, వ్యాపారం అచ్చిరాక పోవడంతో అప్పులు పెరిగి ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉంటున్న ఓ వ్యక్తి ఇంటర్నెట్‌ చూశాడు.. ఒక ఛానల్‌లో తాళం వేసి ఉన్న బైక్‌లను ఎలా తీయాలో నేర్చుకున్నాడు.  కరీంనగర్‌ కమిషనరేట్‌లో పలు ప్రాంతాల్లో 12 బైక్‌లను దొంగతనం చేసి, చివరికి పోలీసులకు చిక్కాడు. కరీంనగర్‌ అడిషనల్‌ డీసీపీ టౌన్‌ డివిజన్‌ డాక్టర్‌ పి.అశోక్‌ తన కార్యాలయంలో మంగళవారం వివరాలు  వెల్లడించారు. రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన మద్ది శ్రీనివాస్‌(33) అలియాస్‌ జల్సా ఆటోడ్రైవర్‌గా పని చేసేవాడు.

2010లో మోతెకు చెందిన అమ్మాయిని కర్నూల్‌లో వివాహం చేసుకొని, 2012 వరకు అక్కడే ఉన్నాడు. తర్వాత గుండి ప్రాంతంలో బ్లేడ్‌ ట్రాక్టర్, కారు, వివిధ వాహనాలు నడిపాడు. 2020 జనవరిలో గోపాల్‌రావుపేటలో ఆటోస్టోర్‌ పెట్టుకున్నాడు. లాక్‌డౌన్‌ వల్ల నష్టం రావడంతో షాపు తీసేసి, కూలీ పనికి వెళ్లాడు. 2021 మార్చి నుంచి కరీంనగర్‌ మంకమ్మతోటలో భార్య, కుమారుడు, కూతురుతో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఉపాధి లేక అప్పులు పెరగడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఇంటర్నెట్‌లో తాళం వేసి ఉన్న బైక్‌లను ఏ విధంగా తీయాలో నేర్చుకొని, కరీంనగర్‌ టూటౌన్‌ పరిధిలో 9, కొడిమ్యాల, రామడుగు, పెగడపల్లి నామాపూర్‌లలో 3 బైక్‌లు దొంగిలించాడు. నంబర్‌ ప్లేట్లు తీసేసి, తన స్నేహితుల వద్ద ఉంచాడు. కేసు నమోదు చేసిన టూటౌన్‌ పోలీసులు శ్రీనివాస్‌ను మంగళవారం పద్మనగర్‌ బైపాస్‌రోడ్డులో అరెస్టు చేశారు. అతడు, అతని స్నేహితుల వద్ద ఉన్న 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. దొంగను పట్టుకున్న టూటౌన్‌ సీఐ లక్ష్మీబాబు, ఎస్సై టి.మహేష్, హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్, పీసీలు జ్ఞానేశ్వర్, శ్రీకాంత్‌రెడ్డి, పవన్‌లను సీపీ కమలాసన్‌రెడ్డి అభినందించి, రివార్డులు ప్రకటించారు.  

మరిన్ని వార్తలు