దొంగతనం మోపారని యువకుడు బలవన్మరణం

23 Feb, 2021 09:13 IST|Sakshi

దొంగతనం మోపారని ఆత్మహత్యాయత్నం

సర్పంచ్‌తోపాటు మరో వ్యక్తిపై కేసు

చిగురుమామిడి(మానకొండూర్‌): చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్‌కు చెందిన నారాయణపురం అనిల్‌(18) మనస్తాపంతో క్రిమిసంహారక మందు తాగాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు  ఎస్సై చల్లా మధుకర్‌రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల కిందట అనిల్‌ మిడిదొడ్డి ఎల్లయ్య ఇంటికి వెళ్లి, సౌండ్‌బాక్స్‌లకు మరమ్మతు చేసి వచ్చాడు. అదే రోజు ఎల్లయ్య ఇంట్లో రూ.4 వేలు పోయాయి. అనుమానం వచ్చిన అతను అనిల్‌పై సర్పంచ్‌ గోలి బాబురెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఆయన అనిల్, అతని తండ్రి సమ్మయ్యలను ఆదివారం పంచాయితీకి పిలిచాడు. ఈ సందర్భంగా ఆ నగదు తాను తీయలేదని అనిల్‌ చెప్పాడు. కానీ తర్వాత తీసినట్లు సర్పంచ్‌కు చెప్పాడు.

దీంతో డబ్బులు తిరిగి ఎల్లయ్యకు ఇవ్వాలని సమ్మయ్యకు సూచించాడు. అనంతరం కుమారుడితో ఇంటికి వెళ్లిన సమ్మయ్య అతన్ని మందలించాడు. అనిల్‌ తనకు ఏపాపం తెలియదని, అన్యాయంగా దొంగతనం మోపారని విలపించాడు. తీవ్ర మనస్తాపానికి గురై మధ్యాహ్నం క్రిమిసంహారక మందు తాగాడు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అర్ధరాత్రి చనిపోయాడు. కాగా తన కుమారుడి చావుకు సర్పంచ్‌ గోలి బాబురెడ్డి, మిడిదొడ్డి ఎల్లయ్యలే కారణమని సమ్మయ్య పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా ఈ విషయమై సర్పంచ్‌ని ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

చదవండి:  తుపాకీ గురిపెట్టి..  కత్తితో బెదిరించి 

మరిన్ని వార్తలు