మహిళతో వివాహేతర సంబంధం.. ఆరేళ్ల క్రితం హత్య చేసి.. సినిమాను తలదన్నేలా..

6 Jan, 2023 19:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆరేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. నిందితుడే స్వయంగా పోలీసులకు లొంగిపోవడంతో పోలీసులకు పని సులువైంది. నిందితుడిని పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. ఆరిలోవ సీఐ ఇమాన్యుయేల్‌ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరిలోవ ప్రాంతానికి చెందిన దాడి లక్ష్మి (48) 2016 ఏప్రిల్‌ 7 నుంచి కనిపించడంలేదని ఆమె భర్త దాడి నాగేశ్వరరావు అదే నెల 9న ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. అదే నెల 11న ముడసర్లోవ రిజర్వాయర్‌లో గుర్తు తెలియని మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. ఆ మృతదేహం మిస్సింగ్‌ అయిన దాడి లక్ష్మిదిగా ఆమె భర్త గుర్తించాడు. ఆమె కాళ్ల, చేతులు కట్టేసి ఉన్నాయి. దీంతో పాటు గోనె సంచికి పెద్ద రాయి కట్టి ఉండటంతో పోలీసులు అప్పట్లో అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సరైన ఆధారాలు లభించకపోవడంతో కొన్నాళ్ల తర్వాత ఆ కేసును పెండింగ్‌లో పెట్టారు. ఇదిలా ఉండగా ఈనెల 4న దాడి లక్ష్మిని 2016 ఏప్రిల్‌ 7న తానే హత్య చేశానంటూ గోపాలపట్నం ప్రాంతానికి చెందిన దాసరి దిల్లీశ్వరరావు ఆరిలోవ పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు అతడి నుంచి వివరాలు సేకరించి గురువారం కోర్టుకు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఏటీఎంలో డబ్బులు తీయించి.. తరువాత హత్య... 
దిల్లీశ్వరరావు రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి. రిటైర్డ్‌ అయిన తర్వాత ఆయన నగరంలో ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. అక్కడ ఉన్న క్యాంటీన్‌లో దాడి లక్ష్మి వంట మనిషిగా పనిచేసేది. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దిల్లీశ్వరరావు 2016లో హౌసింగ్‌ లోన్‌ తీసుకొని గోపాలపట్నంలో ఇళ్లు కొన్నాడు. ఇళ్లు కొనగా మిగిలిన మరికొంత నగదు అతని భార్య బ్యాంక్‌ ఖాతాలో ఉంది. డబ్బులు అవసరమై అడిగితే ఆమె ఇవ్వలేదు.

దీంతో ఆమె బ్యాంక్‌ ఏటీఎం కార్డు తీసుకొచ్చి లక్ష్మితో ఏటీఎంలో అవసరమైన డబ్బులు విత్‌డ్రా చేయించాడు. ఆ విషయమై దిల్లీశ్వరరావును అతని భార్య నిలదీసింది. అంతటితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె ఏటీఎం కార్డు ఉపయోగించి ఓ మహిళ డబ్బులు విత్‌డ్రా చేసినట్లు సీసీ కెమెరాలలో వెల్లడైంది.

దీంతో లక్ష్మితో ఉన్న సంబంధం బయటపడిపోతుందనే భయంతో ఆమెను అంతం చేయాలనుకున్నాడు. అందుకు తగిన ప్లాన్‌ వేసుకున్నాడు. 2016 ఏప్రిల్‌ 7న రాత్రి లక్ష్మిని బైక్‌పై ఎక్కించుకొని ముడసర్లోవ ప్రాంతానికి తీసుకెళ్లాడు. బీఆర్‌టీఎస్‌ పక్కన సింహాచలం కొండ అంచున ఆమె మెడ గట్టిగా పట్టి చంపేశాడు. కాళ్లు చేతులు కట్టేసి మృతదేహాన్ని ఓ గోనె సంచిలో పెట్టాడు. మృతదేహం తేలకుండా గోనె సంచికి పెద్ద రాయిని తాడుతో కట్టి ముడసర్లోవ రిజర్వాయర్‌లో పడేశాడు.
చదవండి: షాకింగ్‌ ఘటన.. ద్విచక్ర వాహనంపై ఒంటరిగా మహిళ.. పొదల్లోకి లాక్కెళ్లి..

ఇదంతా ఆయన స్వయంగా వచ్చి లొంగిపోయి వివరించడంతో పోలీసులు అవాక్కయ్యారు. దీని ప్రకారం దిల్లీశ్వరరావును కోర్టులో హాజరుపరిచి అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. తాను చేసిన పాపానికి తగిన శిక్ష అనుభవిస్తున్నానని, తన భార్య, పిల్లలు తనకు దూరంగా ఉండటంతో తాను ఒంటరయ్యానని పోలీసులకు తెలియజేశాడు. ఇటీవల తన కుమార్తె వివాహం కూడా తనకు తెలియకుండా జరిపించారని పేర్కొన్నాడు. పశ్చాత్తాపంతో చేసిన నేరం అంగీకరిస్తున్నట్లు తెలిపాడు.    

మరిన్ని వార్తలు