దొంగతనం నెపంతో చెట్టుకి కట్టేసి చితకబాదారు

5 Sep, 2020 15:27 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. దొంగతనం చేశాడనే నేపంతో ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. అవమానం భరిచలేక సదరు యువకుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ సంఘటన రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. వాసిద్‌ అనే యువకుడు మాదక ద్రవ్యాలకు బానిసగా మారాడు. ఈ క్రమంలో తమ ప్రాంతలోని ప్రభుత్వ కార్యాలయంలో కొన్ని వస్తువులను దొంగిలించాడని స్థానికులు ఆరోపించారు. ఈ మేరకు అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దాడి చేశారు. కొందరు యువకులు జరిగే తతంగాన్ని తమ సెల్‌ఫోన్‌లలో బంధించారు. అనంతరం అతడిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. వాసిద్‌ తమ దగ్గర నుంచి దొంగిలించిన వస్తువులను తీసుకున్నాము.. అతడి మీద ఎలాంటి కేసు ఫైల్‌ చేయకూడదని స్థానికులు పోలీసులకు తెలిపారు. అతడు చేసిన పనికి తామే వాసిద్‌ని శిక్షించామని.. కేసు పెట్టవద్దని కోరారు. (చదవండి: సినీ నటి ఇంట్లో బంగారం దోచేసిన నర్సు)

దాడి సమయంలో వాసిద్‌కు చిన్న చిన్న గాయలే అయ్యాయంటున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియోలో తీవ్రంగా గాయపడిన వాసిద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఓ చెక్క బెంచీ మీద కూర్చుని ఉన్నాడు. అతడి కుడి మోకాలికి గాయం అయ్యింది. బట్టలు చిరిగి పోయి ఉన్నాయి. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరిన అనంతరం వాసిద్‌ని విడిచిపెట్టారు. పోలీస్‌ స్టేషన్‌ నుంచి వెళ్లిన గంటకే వాసిద్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. జరిగిన అవమానాన్ని భరించలేకనే అతడు చనిపోయినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని, దాని ఫలితాలు వెలువడిన తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు