భార్యే స్వయంగా ఓసీ క్వార్టర్‌ తీసుకుని వచ్చి తాగించి.. అర్ధరాత్రి..

10 May, 2022 14:04 IST|Sakshi

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

సాక్షి, ఖమ్మం(కొత్తగూడ): అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం రామన్నగూడెంలో సోమవారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుగులోతు రాంజీ(40) ఆదివారం రాత్రి స్లాప్‌ పైన పడుకున్నాడు. తెల్లవారినా రాంజీ కిందకు రాకపోవడంతో తల్లి దస్లీ పైకి వెళ్లి చూసింది. అక్కడ రాంజీ మృతి చెందినట్లు నిర్ధారించుకుని బోరున విలపించింది. దస్లీ ఏడుపులు విన్న సర్పంచ్‌ బానోతు సుగునకిషన్‌తో పాటు తండా వాసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా రాంజీ గొంతుకు వైర్‌తో ఉరి వేసిన అచ్చులు, పక్కనే డిష్‌వైర్, పగిలిన చేతి గాజులను చూసి రాంజీది సహజ మరణం కాదని గుర్తించారు. విషయాన్ని కొత్తగూడ ఎస్సై నగేష్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్‌ డీఎస్పీ సదయ్య, గూడూరు సీఐ యాసిన్‌లు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. మృతుడికి భార్య శాంతి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

చదవండి: (ప్రేమ పేరుతో మోసం.. మాయమాటలు చెప్పి లోబర్చుకుని..)

ఎవరి ప్రమేయం?
గత సంవత్సరం గుగులోతు రాంజీ తన భార్యతో కలిసి సుతారి పని చేసుకోవడానికి హనుమకొండకు వలస వెళ్లారు. అక్కడ రాంజీ భార్యకు వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన ఒక వ్యక్తికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై గత నెలలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి హనుమకొండలో ఉండకుండా ఇంటి వద్దే ఉండి ఏదైనా పని చేసుకోవాలని తీర్మానం చేశారు. దీంతో రాంజీ కుటుంబం మళ్లీ రామన్నగూడెం చేరుకుంది. వేసవికాలం కావడంతో ప్రతీ రోజు పిల్లలతో కలసి అందరూ ఇంటి మేడ పైన నిద్రించేవారు. ఆదివారం రాత్రి మాత్రం రాంజీకి తన భార్య స్వయంగా ఓసీ క్వార్టర్‌(మద్యం) తీసుకుని వచ్చి తాగించింది. రాత్రి 10.30ని.ల వరకు ఇంట్లో టీవీ చూసిన పిల్లలు ఇంట్లోనే పడుకున్నారు. అర్ధరాత్రి రెండు ద్విచక్రవాహనాలు వచ్చి రాంజీ ఇంటికి కొంతదూరంలో ఆగినట్లు స్థానికులు అంటున్నారు. దీంతో తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో భార్యే మరికొందరితో కలసి రాంజీని వైర్‌తో ఉరివేసి హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

విచారిస్తున్నాం : సదయ్య, డీఎస్పీ 
గుగులోతు రాంజీ మృతిపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాం. రాంజీ భార్య సెల్‌ఫోన్‌ ఆధారంగా ఆదివారం రాత్రి ఎవరితో మాట్లాడింది, సంఘటన స్థలంలో లభించిన ఆధారాలు, వేలి ముద్రలతో పాటు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ ఆధారంగా నిందితులను గుర్తిస్తాం.  

మరిన్ని వార్తలు