సోషల్‌మీడియా మోజులో భార్య తనను పట్టించుకోవడం లేదని

11 Jul, 2021 20:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సోషల్‌మీడియా మోజులో పడి భార్య తనను పట్టించుకోలేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సనత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సనత్‌ నగర్‌లోని ఫతేనగర్‌కు చెందిన పవన్(34)కు మౌలాలికి చెందిన మౌనికతో 2015లో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది నెలల నుండి ఇద్దరి మధ్యా మనస్పర్థలు తలెత్తడం మొదలయ్యాయి. అంతేకాకుండా ఇద్దరికీ సంతానం లేకపోవడంతో మనస్పర్థలు అధికమయ్యాయి. మౌనిక తరచూ సోషల్‌ మీడియాలో వీడియోలు చేస్తుండటం, తాను స్టార్ అవుతానని చెబుతుండటం పవన్‌కు ఇష్టం ఉండేది కాదు. వీటి వల్ల తరచూ గొడవలు జరిగేవి. కోవిడ్‌ టైంలో పవన్ తన కాంట్రాక్ట్‌ ఉద్యోగాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇలా అన్ని రకాల సమస్యల వల్ల మానసిక సంఘర్షణకు గురయ్యేవాడు. శుక్రవారం తన భార్య మౌనికను మౌలాలిలోని పుట్టింటి వద్ద విడిచిపెట్టాడు. అదేరోజు రాత్రి ఫోన్లో ఇద్దరికీ సంతానంతో పాటు ఇతర కుటుంబ విషయాలపై చిన్నపాటి గొడవ జరిగింది.

ఇలా తరచూ వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలను తట్టుకోలేక జీవితం మీద విరక్తితో శనివారం ఉదయం ఫతేనగర్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు స్థానిక సనత్‌ నగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు తన కోడలు మౌనిక కారణమని ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు సరిగా స్పందించలేదంటూ బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు. ఇదేవిషయంలో తన భర్త పవన్ మృతిపై చాలా అనుమానాలున్నాయని భార్య మౌనిక సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు