లగ్జరీ కార్లే టార్గెట్‌! విమానంలో వస్తాడు... దొంగిలించిన కారులో జారుకుంటాడు

26 Apr, 2022 07:23 IST|Sakshi
సత్యేంద్రసింగ్‌ షెకావత్‌

బంజారాహిల్స్‌: ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో 61 లగ్జరీ కార్లు చోరీ చేశాడు.... నాలుగు సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు... అయినా ప్రవర్తన మార్చుకోకుండా ఈ సారి హైదరాబాద్‌పై కన్నేసిన అతను రెండు నెలల్లో అయిదు లగ్జరీ కార్లు తస్కరించి నగర పోలీసులకు సవాల్‌గా మారాడు. ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు ఇటీవల ఈ సింగిల్‌ హ్యాండ్‌ కార్ల దొంగను పట్టుకోవడంతో గుట్టురట్టయింది. అంతర్రాష్ట్ర కార్ల దొంగ సత్యేంద్రసింగ్‌ షెకావత్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు ఇక్కడ జరిగిన ఓ కారు దొంగతనం కేసులో కస్టడీకి తీసుకున్నారు.

విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది జనవరి 26న  షెకావత్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లోని పార్క్‌హయాత్‌ హోటల్‌లో కన్నడ నిర్మాత మేఘనాథ్‌ ఫార్చునర్‌ కారును దొంగిలించి పరారయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే దుండిగల్‌పోలీ స్‌ స్టేషన్‌ పరిధిలో ఒకటి, నాచా రం పీఎస్‌ పరిధిలో ఒక కారు, పేట్‌బషీరాబాద్‌ పరిధిలో రెండు కార్లు చోరీ చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరు గుతున్నాడు. ఏడాది వ్యవధిలోనే బెంగళూరు, చెన్నై, గుజరాత్, హైదరాబాద్, తదితర ప్రధాన నగరాల్లో 21 లగ్జరీ కార్లను చోరీ చేశాడు. అతడిని అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు 21 కార్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో హైదరాబాద్‌లో దొంగిలించిన అయిదు కార్లు కూడా ఉన్నాయి.

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన డివైస్‌ను ఉపయోగించి కారు డోర్‌లు తెరుస్తూ కేబుల్‌ కనెక్ట్‌ చేసి ఎంచక్కా వాటిలో దూసుకెళ్లేవాడు. దొంగిలించిన కార్లను తక్కువ ధరకు అమ్మేస్తూ జల్సా చేసేవాడు. పార్క్‌హయత్‌లో కారు దొంగతనం చేసేందుకు అతను విమానంలో వచ్చాడు. అలాగే పేట్‌బషీరాబాద్‌లో కార్ల చోరీ సమయంలోనూ విమానంలోనే వచ్చిన షెకావత్‌ లగ్జరీ కార్‌ కొట్టేసి అందులోనే పరారయ్యాడు. కార్లు దొంగిలించేందుకు కేవలం జేబులో ఓ డివైస్‌ పెట్టుకొని ఫ్లైట్‌ ఎక్కి రయ్‌మంటూ వస్తాడు. కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 1, తమిళనాడులో 1, హైదరాబాద్‌లో అయిదు దొంగతనాలు చేసినట్లు బంజారాహిల్స్‌ పోలీసుల విచారణలో వెల్లడించాడు.  ఇప్పటి వరకు మొత్తం 61 కార్లు దొంగిలించి విక్రయించినట్లు తెలిపాడు.

(చదవండి: రూ.1,700 కోట్ల హెరాయిన్‌ పట్టివేత)

మరిన్ని వార్తలు