నీరు కావాలని ఇంట్లోకి ప్రవేశించి.. టీవీ సౌండ్‌ పెంచి.. కత్తి తీసుకుని.. 

12 Mar, 2022 18:37 IST|Sakshi

అనంతపురం క్రైం: నగర శివారులోని ఒక ఇంటి వద్దకు అపరిచిత వ్యక్తి వెళ్లాడు. దాహం వేస్తోంది.. నీరివ్వండని ఇంట్లోకి ప్రవేశించాడు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడపై కత్తి పెట్టి బంగారు గొలుసు లాక్కుని ఉడాయించాడు. అనంతపురం రూరల్‌ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపిన మేరకు... కక్కలపల్లి కాలనీ సమీపంలోని రజాక్‌ ఫంక్షన్‌ హాలు వెనుకవైపున ఎల్‌.రామసుబ్బారెడ్డి, జి.విజయ దంపతులు నివాసం ఉంటున్నారు. రామసుబ్బారెడ్డి కనగానపల్లి మండలం కొండంపల్లిలో ఉపాధ్యాయుడిగాను, విజయ ఆత్మకూరు మండలం గొరిదిండ్ల పాఠశాలలో హెచ్‌ఎంగాను విధులు నిర్వర్తిస్తున్నారు.

శుక్రవారం ఉదయం 8.30 గంటలకు వీరిద్దరూ విధులకు వెళ్లిపోయారు. కుమార్తె దీక్షితను స్కూలుకు పంపించారు. ఇంట్లో రామసుబ్బారెడ్డి తల్లి ఎల్‌.నారాయణమ్మ (88 సంవత్సరాలు) ఉంది. ఉదయం 11 గంటలకు ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి ఇంటి కాలింగ్‌ బెల్‌ కొట్టాడు. ఎవరంటూ నారాయణమ్మ లోపలినుంచే ప్రశ్నించగా.. మీ అబ్బాయికి డబ్బు ఇవ్వాల్సి ఉందని అతడు సమాధానమిచ్చాడు. అయితే అబ్బాయికే ఫోన్‌ చేయి అంటూ చెప్పింది. అందుకు ఆ వ్యక్తి ఫోన్‌ తగల్లేదని చెప్పాడు. అయితే పై అంతస్తులో మా బంధువు ప్రశాంత్‌ ఉంటాడు అతడిని కలువు అని తెలిపింది. సరే అని బయటకు వచ్చి మొదటి ఫ్లోర్‌ వరకు మెట్లు ఎక్కి.. అక్కడ ఎవరూ లేరని కిందకు వచ్చాడు.  

మంచి నీరు కావాలని.. 
పై అంతస్తు నుంచి కిందికి వచ్చిన అపరిచిత వ్యక్తి మంచి నీరు కావాలని కోరగా.. నారాయణమ్మ వాకర్‌ సాయంతో మెల్లగా తలుపు తీసింది. అలా లోనికి వెళ్లిన తర్వాత టీవీ ఆన్‌ చేయాలని కోరాడు. ఆ తర్వాత రిమోట్‌ తీసుకుని తనే సౌండ్‌ పెంచాడు. అలా ఆమాటా.. ఈమాటా మాట్లాడుతూ  ఎవరైనా వస్తున్నారా? అని అప్పుడప్పుడు బయటకు వచ్చి తొంగి చూశాడు. అలా బయటకు వెళ్లి బైక్‌ బ్యాగ్‌లో ఉంచుకున్న కత్తిని తీసుకొచ్చి ఇంట్లోని వృద్ధురాలి నారాయణమ్మ మెడపై పెట్టి అరిస్తే చంపుతానని బెదిరించాడు. ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కుని అక్కడి నుంచి ఉడాయించాడు. అనంతరం బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో పై పోర్షన్‌లో ఉన్న వివాహిత నాగలక్ష్మి కిందకు వచ్చింది. జరిగిన విషయం తెలుసుకుని రామసుబ్బారెడ్డి దంపతులకు సమాచారం అందించింది. రామసుబ్బారెడ్డి డయల్‌ 100కు కాల్‌ చేశాడు. 

పోలీసుల అప్రమత్తం 
బంగారు గొలుసు దోపిడీ విషయం తెలియగానే డీఎస్పీ వీరరాఘవరెడ్డి జిల్లాలోని వివిధ సబ్‌ డివిజన్ల వారిని సెట్‌లో అప్రమత్తం చేశారు. జిల్లా కేంద్రం ప్రవేశమార్గాలు, ప్రధాన కూడళ్లలో వాహనాల తనీఖీ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఫుటేజ్, తదితర తనిఖీలు చేసేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు.    

మరిన్ని వార్తలు