మగవాళ్లకు అంత జుట్టు అవసరమా?

23 Oct, 2020 14:29 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం/సంగారెడ్డి : తానో పోలీసునని, ఆడవాళ్లలా జుట్టు పెద్దగా పెంచుకుంటే కేసు పెడతానని యువకులపై బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని శుక్రవారం విశాఖ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సంగారెడ్డికి చెందిన మచుకూరి పండారి అనే వ్యక్తి తాను సీఐని అంటూ అనకాపల్లి భీముని గుమ్మం ప్రాంతానికి చెందిన మణికుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి జుట్టు కత్తిరించుకోవాలని బెదిరించాడు. దీంతో మణికుమార్ తన జుట్టును కత్తిరించుకున్నాడు. పండారి అంతటితో ఆగక, గుండు చేయించుకోకపోతే సైబర్ క్రైమ్ నేరంపై కేసు నమోదు చేస్తామని మణికుమార్‌ను వేధించాడు. దీంతో అనుమానం వచ్చిన మణికుమార్ బంధువులు అనకాపల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో పండారి విషయం వెలుగులోకి వచ్చింది. అతడు ఆంధ్ర, తెలంగాణలో పలువురు యువకులను బెదిరించి జుట్టు కత్తిరించుకునేలా చేస్తున్నట్టు తెలిసింది. ( తల్లిపై దాడి; తండ్రిని హతమార్చిన కూతురు)

మణికుమార్ జుట్టు కత్తిరించుకుని నిందితుడికి ఫొటో పెట్టగా.. అతని అన్నను కూడా జుట్టు కత్తిరించుకోమని బెదిరించినట్లు  వెల్లడైంది. బాధితులు పోలీసులను ఆశ్రయించగా సదరు వ్యక్తిని ఫేక్ కాలర్‌గా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు చూసి తలపై జుత్తు ఎక్కువగా ఉంటే వారి ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి బెదిరించడం నిందితుడికి అలవాటని చెప్పారు. గతంలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. పోలీసులమంటూ ఫేక్ కాల్ చేస్తే ఎవరూ భయపడవద్దని తెలిపారు.

మరిన్ని వార్తలు