కీచకుడు: వాట్సాప్‌ కాల్స్‌తో 370 మంది మహిళలకు టార్చర్‌

25 Jun, 2021 12:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : మహిళలకు అభస్యకరమైన రీతిలో వాట్సాప్‌ కాల్స్‌ చేస్తూ వేధించాడో కీచకుడు. దాదాపు 370 మంది మహిళలను టార్చర్‌ చేశాడు. చివరకు పాపం పండి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన ఉ‍త్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బల్లియా జిల్లాకు చెందిన 35 ఏళ్ల శివ కుమార్‌ వర్మ స్టేషనరీ షాపు నిర్వహిస్తున్నాడు. మహిళలను వేధించటానికి ఏడు ఫోన్లను వాడేవాడు. ప్రతీ ఫోన్‌లో ఓ కొత్త నెంబర్‌ వాడి, మహిళలకు కాల్‌ చేసేవాడు. అనంతరం ఆ సిమ్‌ను నాశనం చేసేవాడు. సెల్‌ ఫోన్‌ కీ ప్యాడ్‌పై ఇష్టం వచ్చినట్లు ఓ పది నెంబర్లు టైపు చేసేవాడు. ఆ నెంబర్‌ను ట్రూ కాలర్‌లో చెక్‌ చేసుకునేవాడు. అది ఆడవారి నెంబర్‌ అయితే ఆ పేరుతో సేవ్‌ చేసుకునేవాడు. అనంతరం వారికి వాట్సాప్‌ కాల్‌ చేసేవాడు. వాట్సాప్‌ కాల్‌ను.. వీడియో స్క్రీన్‌ రికార్డు మోడ్‌లో ఉంచి, దుస్తులు విప్పేవాడు. ఇది గుర్తించిన మహిళలు కాల్‌ కట్‌ చేసేవాళ్లు. ఇలా కాల్‌ కట్‌ చేసిన వాళ్లను మళ్లీ వేధించేవాడు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబితే తన వద్ద ఉన్న స్క్రీన్‌ రికార్డింగులను భర్తకు, బంధువులకు పంపుతానని బెదిరించేవాడు. దీంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయటానికి భయపడేవారు. కొంతమంది నెంబర్లు మార్చేసేవారు.  ఫిబ్రవరి 2020లో లక్నోకు చెందిన ఓ మహిళ వర్మకు వ్యతిరేకంగా 1090 నెంబర్‌కు ఫోన్‌ చేసింది. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని పలుమార్లు కౌన్సిలింగ్‌ ఇచ్చి వదిలేశారు. అయినా అతడిలో మార్పు రాలేదు. మళ్లీ తన పాత పంథానే కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో అతడి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని, అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు