కరోనా దొంగను చేసింది 

7 Sep, 2020 07:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: కష్టపడి పనిచేసే తనను కరోనా వైరస్‌ దొంగను చేసిందని ఓ వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం పూందమల్లి పోలీసులను షాక్‌ గురి చేసింది. తాను దొంగను కాదని, ఆదాయం లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో మారక తప్పలేదని అతడు కన్నీళ్లు పెట్టుకున్నా, కారాగార వాసం తప్పలేదు. పూందమల్లి నషరత్‌పేట మేప్పురుకు చెందిన శివరాజ్‌ ఇంట్లో గత నెల చోరీ జరిగింది. అయితే ఇంట్లో విలువైన వస్తువులు చోరీకి గురి కాలేదు. టీవీ, ల్యాప్‌టాప్‌ మాయమయ్యాయి. పూందమల్లి పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా శనివారం రాత్రి ఓ యువకుడ్ని పట్టుకున్నారు. పూందమల్లి అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన అప్పు అలియాస్‌ అప్పన్‌రాజ్‌(25)గా అతడ్ని గుర్తించారు. తాను దొంగను కానని, తాను ఏ మేరకు కష్ట పడి శ్రమించే వాడినో అని వివరిస్తూ, తాను గతంలో పనిచేసిన ప్రదేశాల్లోకి వెళ్లి విచారించుకోవాలని ఎదురు తిరిగాడు. ( సినీ నటి ఇంట్లో బంగారం దోచేసిన నర్సు )

చివరకు పోలీసు ట్రీట్‌మెంట్‌కు తాను దొంగను కాదని, కరోనా దొంగను చేసిందని కన్నీటి పర్యంతం అయ్యాడు. కరోనా లాక్‌ పుణ్యమా పని దొరక్క, చేతిలో చిల్లి గవ్వలేక సతమతం అవుతున్న సమయంలో ఓ చోట అనాథగా పడి ఉన్న మోటారు సైకిల్‌పై కన్ను పడిందని, దానిని తీసుకెళ్లి అమ్మేశానని, ఆ తర్వాత ఓ రోజు శివరాజ్‌ ఇంటిపై కన్నేసి టీవీ, ల్యాప్‌టాప్‌ మాత్రం పట్టుకెళ్లి అమ్మేసినట్టు వివరించాడు. కష్టపడి పనిచేసే తనను కరోనా దొంగగా మార్చేసిందని, తనను వదలి పెట్టాలంటూ కాళ్లా వేళా పడ్డా, చేసిన నేరానికి శిక్ష తప్పదు కాబట్టి ఆదివారం అరెస్టు చేశారు.   

మరిన్ని వార్తలు