నడిరోడ్డులో వ్యక్తిపై బాలుడి కాల్పులు.. లైవ్ వీడియో

16 Jul, 2022 17:06 IST|Sakshi

ఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున కాల్పులు కలకలం సృష్టించాయి. 36 ఏళ్ల ఓ వ‍్యక్తి రోడ్డు పక్కన దుకాణం ముందు కూర్చొని ఉండగా ఓ బాలుడు అతడి ముఖంపై కాల్పులు జరిపి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు మైనర్లను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. శుక్రవారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని జహంగిర్‌పురి ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు వెల్లడించారు.

హుటహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తూటా తగిలిన జావేద్‌ అనే వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. బాధితుడి కుడి కంటికి తీవ్ర గాయమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

బాధితుడు జావేద్‌ చెప్పిన వివరాల ప్రకారం.. శుక‍్రవారం సాయంత్రం 4.45 గంటల ప్రాంతంలో పార్క్‌ సమీపంలోని ఓ దుకాణం ముందు కూర్చుని ఉన్నాడు. ముగ్గురు మైనర్‌ బాలురు అక్కడికి వచ్చారు. అందులోని ఓ బాలుడు గన్‌ తీసి ముఖంపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారని డిప్యూటీ కమిషనర్‌ ఉషా రంఘ్నాని తెలిపారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. జహంగిర్‍పురి స్టేషన్‌లో హత్యా యత్నం కేసు నమోదు చేసి నలుగురు బాలురను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. వారి దగ్గరి నుంచి నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 

అసలు కారణం ఇదీ..
పోలీసుల విచారణలో నిందితుల్లో ఓ బాలుడి తండ్రిని ఏడు నెలల క్రితం బాధితుడు కొట్టినట్లు తెలిసింది. దీంతో కోపం పెంచుకున్న బాలుడు తన స్నేహితులతో కలిసి అతడిని చంపాలని ప్రణాళిక చేశాడు. అందులో భాగంగానే నాటు తుపాకీతో కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. 

ఇదీ చూడండి: Orissa Crime: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం: భార్య తలను నరికి చేతిలో పట్టుకుని 12 కి.మి..

మరిన్ని వార్తలు