దారుణం.. ‘థ‍్యాంక్‌ యూ’ చెప్పలేదని పొడిచి చంపాడు..!

22 Sep, 2022 13:51 IST|Sakshi

వాషింగ్టన్‌: చిన్న చిన్న గొడవలకే కొందరు సహనం కోల్పోతున్నారు. ఎదుటివారిపై దాడి చేసి వారి ప్రాణాలు పోయేందుకు కారణమవుతున్నారు. అలాంటి సంఘటనే అమెరికాలోని బ్రూక్లిన్‌లో వెలుగు చూసింది. ‘థ్యాంక్‌ యూ’ చెప్పలేదని మొదలైన వాగ్వాదం.. చిలికి చిలికి గాలివానగా మారి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేందుకు దారి తీసింది. 37 ఏళ్ల వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడవటంతో తీవ‍్ర గాయాలై మృతి చెందాడు. 

పార్క్‌ స్లోప్‌లోని 4వ అవెన్యూ భవనం స్మోకింగ్‌ దుకాణం వద్ద ఈ గొడవ జరిగింది. ఈ సంఘటన స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదైంది. తెల్ల రంగు టీషర్ట్‌ ధరించిన బాధితుడు లోపలికి రాగా.. మరో వ్యక్తి డోర్‌ తెరిచాడు. అయితే, డోర్‌ తెరిచినందుకు కృతజ్ఞతలు తెలపకపోవటంపై లోపలి వ్యక్తి ప్రశ్నించాడు. దాంతో తాను తెరవాలని కోరలేదని, థ్యాంక్‌ యూ చెప్పనని స్పష్టం చేశాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. బయటకు వెళ్లిన నిందితుడు తన సైకిల్‌ పై ఉన్న కత్తిని తీసుకొచ్చి బెదిరించాడు. బాధితుడు వెనక్కి తగ్గకుండా రెచ్చగొట‍్టగా.. పొట్ట, మెడ భాగంలో కత్తితో దాడి చేశాడు నిందితుడు. తీవ్రంగా రక్తస్రావమైంది. న్యూయార్క్‌ ప్రెస్బిటేరియన్‌ బ్రూక్లిన్‌ మెథొడిస్ట్‌ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి: టిక్‌టాక్‌ ప్రేమ.. భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య

మరిన్ని వార్తలు