ఇయర్‌ఫోన్స్‌తో లోకాన్ని మరిచి.. 

3 Mar, 2021 11:04 IST|Sakshi

రైలు ఢీకొనడంతో కార్పెంటర్‌కు తీవ్రగాయాలు

నెల్లూరు(క్రైమ్‌): ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకొని సంగీతం వింటూ పట్టాలపై వెళ్తున్న ఓ యువకుడ్ని రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఘటన విజయమహల్‌ గేట్‌ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ ప్రభాకర్‌ సమాచారం మేరకు.. కార్పెంటర్‌గా జీవనం సాగిస్తున్న బుచ్చిరెడ్డిపాళెం మండలం ఇస్కపాళేనికి చెందిన షఫీఉల్లా నగరానికి వచ్చారు. ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద బస్సు దిగి, ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకొని సంగీతం వింటూ రైలు పట్టాలపై పొగతోటకు బయల్దేరారు. విజయమహల్‌ గేట్‌ సమీపానికి చేరుకోగా, చెన్నై వైపు నుంచి గూడ్స్‌ రైలు వస్తుండటాన్ని గమనించలేదు.

స్థానికులు పెద్దగా కేకలు వేసినా, ఇయర్‌ఫోన్స్‌ ఉండటంతో వినపడలేదు. దీంతో రైలు వేగంగా ఢీకొంది. క్షతగాత్రుడ్ని స్థానికులు తొలుత ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన నెల్లూరు చేరుకొని క్షతగాత్రుడ్ని మెరుగైన వైద్యం నిమిత్తం మెడికవర్‌ హాస్పిటల్లో చేర్పించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య 
వెంకటాచలం : కూలి పని విషయంలో సహకూలీలతో జరిగిన వివాదాలతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెంకటాచలం మండలం, సర్వేపల్లిలోని ఎస్‌ఎన్‌జే బీర్‌ ఫ్యాక్టరీ వద్ద సోమవారం జరిగింది. ఒరిస్సా రాష్ట్రం పార్లకేముండి గణపతి జిల్లా పరసంబా గ్రామానికి చెందిన నిమియా సబర్‌(25) సర్వేపల్లిలోని ఎన్‌ఎన్‌జే బీర్‌ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. అతని గ్రామానికి చెందిన కొందరు బీర్‌ ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు.

అయితే గత కొన్నిరోజులుగా తోటి కూలీలతో జరుగుతున్నవివాదాల కారణంగా నిమియా సబర్‌ మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం మధ్యాహ్నం కూడా కూలీలు నిమియా సబర్‌ను అవమానపరచడంతో ఫ్యాక్టరీ క్వార్టర్స్‌ వెనుక ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహ్యత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని నిమియా సబర్‌ సహకూలీ బసంత్‌రావ్‌ సబర్‌ సోమవారం రాత్రి 11 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల సర్వేపల్లికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహన్ని పోస్టుమార్టం చేయించి కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు