ప్రశ్నించిన పాపానికి.

4 Aug, 2020 05:35 IST|Sakshi
మృతురాలు మంత్రీబాయి

మహిళపైకి దురుసుగా ట్రాక్టర్‌ నడిపిన వ్యక్తి 

తీవ్ర గాయాలతో మహిళ మృతి  

రాజుపాలెం (నకరికల్లు): ‘నా పొలంలో పనికి ఎవరూ వెళ్లొద్దని ప్రచారం చేస్తున్నావంటా.. ఇదేం పద్ధతి’ అని ప్రశ్నించబోయిన మహిళపైకి ఒక వ్యక్తి దురుసుగా ట్రాక్టర్‌ నడిపిన ఘటనలో మహిళ తీవ్ర గాయాలతో మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా నకరికల్లు పంచాయతీ పరిధిలోని శివాపురం తండాలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ పి.ఉదయ్‌బాబు తెలిపిన వివరాలివీ..  

► నకరికల్లు మండలం శివాపురం తండాకు చెందిన రమావత్‌ మంత్రూనాయక్‌ పొలంలో పనికి ఎవరూ వెళ్లవద్దని భువనముక్కల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి గ్రామంలోని వారందరికీ చెబుతున్నాడు. ఇదేం పద్ధతి అని శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించేందుకు మంత్రూనాయక్‌ భార్య మంత్రీబాయి (55) తండాలోని ప్రధాన కూడలిలో నిలుచుంది. ట్రాక్టర్‌ వేసుకుని వస్తున్న శ్రీనివాసరెడ్డిని ఇదే విషయం అడిగేందుకు ట్రాక్టర్‌ ఆపమంది. అయితే ఆమె మాటలు లెక్కచేయకుండా ట్రాక్టర్‌ను దురుసుగా ఆమెపైకి పోనివ్వడంతో ట్రక్కు కింద పడిపోయింది. స్థానికులు నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించగా కొద్దిసేపటికే మృతి చెందింది.  కాగా, శ్రీనివాసరెడ్డి వద్ద మంత్రూనాయక్‌ రూ.3.80 లక్షలు అప్పుగా తీసుకున్నాడని, ఈ విషయంలో ఇరువురి మధ్య వివాదం నడుస్తోందని తెలుస్తోంది. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు