ఎనిమిదో భార్యను చంపి జైలుకు, రెండో భార్య కొడుకు చేతిలో..

13 Apr, 2021 13:49 IST|Sakshi

తండ్రిపై తనయుని దాడి

కత్తితో గొంతు కోసి హత్యాయత్నం 

ఆస్తి వివాదాలే కారణం

సాక్షి, మదనపల్లె టౌన్: ఆస్తిలో వాటా ఇవ్వలేదనే కోపంతో సాక్షాత్తు కన్న తండ్రి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడో  ప్రబుద్ధుడు. మదనపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం టూ టౌన్‌ సీఐ నరసింహులు, ఎస్‌ఐ బాబు విలేకరులకు తెలిపిన వివరాలు..స్థానిక చలపతిరావు కాలనీకి చెందిన కుందాని భాస్కర్‌ అలియాస్‌ శవాల భాస్కర్‌(53) స్థానికంగా ఎవరైనా చనిపోతే ఆ మృతదేహాలను తీసుకెళ్లి ఖననం చేయడంపై ఆధారపడి జీవిస్తున్నాడు.

ఇతనికి 9 మంది భార్యలు, 14 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ఎనిమిదవ భార్య ఉషారాణిని 12 ఏళ్ల క్రితం హత్య చేసి భాస్కర్‌ జైలుకు వెళ్లాడు. కొంతకాలానికి బయట కొచ్చిన అతను కలకడకు చెందిన ఆదెమ్మను పెళ్లి చేసుకున్నాడు. అక్కడికే మకాం మార్చి గుజిరీ సేకరించి వచ్చే ఆదాయంతో జీవిస్తున్నాడు. అయితే కన్నబిడ్డలను ఏ మాత్రం పట్టించుకోలేదు.

ఈ నేపథ్యంలో రెండవ భార్య ప్రభావతి కొడుకు దినేష్‌ (23) చలపతిరావు కాలనీలో తండ్రి పేరిట ఉన్న 8 సెంట్ల ఆస్తిలో తనకూ భాగం పంచాలని తండ్రిని ఒత్తిడి చేశాడు. తాను త్వరలో మదనపల్లెకు వస్తానని, ఆ రోజే దీనిపై మాట్లాడుతానని నచ్చ జెప్పాడు. ఆదివారం రాత్రి మదనపల్లెకు వచ్చిన భాస్కర్, చలపతిరావు కాలనీలోని తన పాత ఇంటిలో ఒంటరిగా ఉండటం చూసి దినేష్‌ తన అనుచరులతో వెళ్లి ఆస్తి పంపకం విషయమై నిలదీశాడు.

అతను పంచేందుకు అంగీకరించకపోవడంతో ఆగ్రహించాడు. కత్తితో దాడిచేసి, గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో తన తండ్రి చనిపోయాడని భావించి పరారయ్యాడు. కొంతసేపటికి తేరుకున్న భాస్కర్‌ రామ్‌నగర్‌లో ఉన్న మరో కొడుకు వద్దకు వెళ్లి స్పృహ కోల్పోయాడు. వారు హుటాహుటిన అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. సమాచారం అందుకున్న సీఐ, ఎస్‌ఐలు ఆస్పత్రికి చేరుకుని ప్రాధమిక విచారణ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ‘మేం చచ్చిపోతున్నాం.. మా పార్ట్స్ నా భార్యకు ఇవ్వండి’

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు