ఏ కత్తితో బెదిరించాడో.. దానికే బలయ్యాడు

7 Mar, 2021 12:03 IST|Sakshi

డబ్బుల కోసం కత్తితో బెదిరించిన ఫయాజ్‌ 

అదే కత్తితో పొడిచి చంపిన బాధితుడు 

భోలక్‌పూర్‌లో కలకలం 

ముషీరాబాద్‌: గంజాయి, వైట్‌నర్‌కు బానిసగా మారి జల్సాల కోసం ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తనకు రెండు వేలు కావాలని ఓ వ్యక్తిని బెదిరించగా అతను ఇవ్వక పోవడంతో ఆగ్రహానికి గురై అతడిని మారణాయుధంతో హత్య చేసేందుకు ప్రయత్నించగా ఎదుటి వ్యక్తి అప్రమత్తమై అదే మారణాయుధంతో ఎదురు దాడి చేసి హత్య చేశాడు. ముషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భోలక్‌పూర్‌ రంగానగర్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రంగానగర్‌లో నివాసం ఉంటున్న ఫయాజ్‌ అలియాస్‌ ఫర్వేజ్‌ (23) చిన్నప్పటి నుంచి చెడు అలవాట్లకు బానిసగా మారాడు. గంజాయి, వైట్‌నర్‌ తాగుతూ బస్తీ ప్రజలను, వ్యాపారులను బెదిరిస్తూ  500, 1000, 2000 రూపాయల చొప్పున బెదిరించి తీసుకునే వాడు. ఇలా ప్రతిసారి ఎవరినో ఒకరిని బెదిరించి డబ్బులు తీసుకోవడం ఫయాజ్‌కు అలవాటుగా మారింది. ఈ క్రమంలో రంగానగర్‌కు  చెందిన సద్దాం హుస్సేన్‌ అనే వ్యక్తిని పలుమార్లు బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. తాజాగా రంగానగర్‌లో ఓ శుభకార్యానికి సద్దాం హుస్సేన్‌ అతడి స్నేహితుడు మోటాగౌస్‌తో కలసి హాజరయ్యాడు.

అక్కడికి వచ్చిన ఫయాజ్‌ తనకు రెండు వేల రూపాయలు కావాలని అడిగాడు. నా దగ్గర లేవనిచెప్పడంతో కోపోద్రిక్తుడైన ఫయాజ్‌ సద్దాం హుస్సేన్‌ పై తన వద్ద ఉన్న కత్తితో దాడికి ప్రయత్నించాడు. దీంతో సద్దాం హుస్సేన్‌ ఎదురు తిరిగి అదే కత్తితో వెంట వచ్చిన స్నేహితుడు మోటా గౌస్‌తో కలసి ఫయాజ్‌పై ఎదురు దాడి చేశారు. కత్తి పోట్లకు గురైన ఫయాజ్‌ రక్తపు మడుగులో అక్కడే అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న ముషీరాబాద్‌ ఇన్స్‌పెక్టర్‌ మురళికృష్ణ, స్థానికులు ఫయాజ్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. హత్యా నేరం కింద కేసు నమోదు చేసి  పరారిలో ఉన్న సద్దాం హుస్సేన్, మోటా గౌస్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు