పక్కాగా ప్లాన్‌ చేసిన దొరికిపోయాడు!....కథ మొత్తం కారు నుంచే..

4 May, 2022 07:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని సింథి కాలనీకి చెందిన పడాల మహేష్‌ బాబు ఐపీఎల్‌ సీజన్‌ నేపథ్యంలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహణ కోసం కొత్త పంథా అనుసరించాడు. తన ఎంజీ హెక్టర్‌ వాహనాన్నే అడ్డాగా చేసుకుని అందులోనే అవసరమైన  పరికరాలు ఏర్పాటు చేసుకున్నాడు. పోలీసుల నిఘా తప్పించుకోవడానికి ఇంత పక్కాగా ప్లాన్‌ చేసినా... మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌కు ఏడుగురు ముఠా సభ్యులతో సహా చిక్కాడు. అదనపు డీసీపీ పి.శ్రీనివాస్‌ రెడ్డి మంగళవారం వివరాలు వెల్లడించారు. తన 19 ఏళ్ల కుమారుడినీ కలెక్షన్‌ ఏజెంట్‌గా మార్చుకోవడం గమనార్హం.  

  • సింథికాలనీకి చెందిన పడాల మహేష్‌ బాబు వృత్తి కన్‌స్ట్రక్షన్‌ వ్యాపారం. ఐపీఎల్‌ సీజన్‌ నేపథ్యంలో వ్యవస్థీకృతంగా క్రికెట్‌ బెట్టింగ్స్‌ నిర్వహించడాన్ని ప్రవృత్తిగా మార్చుకుని ప్రధాన బుకీగా మారాడు. డెన్‌ ఏర్పాటు చేస్తే పోలీసులకు చిక్కుతామని తన ఎంజీ హెక్టర్‌ వాహనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. 
  • అందులోనే ప్రత్యేకంగా బ్యాటరీతో పాటు వైఫై రూటర్లు అమర్చుకున్నాడు. ల్యాప్‌టాప్, కాల్‌ కనెక్టర్‌ బాక్స్, రికార్డర్లు, టీవీ, అకౌంట్‌ పుస్తకాలు.. ఇలా బెట్టింగ్‌ నిర్వహణకు అవసరమైన సమస్తం కారులోనే ఉండేలా చూసుకున్నాడు. తన కుమారుడైన జతిన్‌ను కలెక్షన్‌ ఏజెంట్‌గా మార్చుకున్నాడు. 
  • నగరానికి చెందిన శ్యామ్‌ సుందర్‌ (సబ్‌ బుకీ), నవాజ్‌ ఖాన్‌ (ఏజెంట్‌), మహేంద్ర కుమార్‌ అగర్వాల్‌ (లైన్‌ ఆపరేటర్‌), ఆనంద్‌ (ల్యాప్‌టాప్‌ ఆపరేటర్‌), నవీన్‌ (అకౌంటెంట్‌), గోవింద్‌ యాదవ్‌లు (కలెక్షన్‌ బాయ్‌)  మహేష్‌ వద్ద నెల జీతానికి పని చేస్తున్నారు.  
  • వీరిలో కొందరు మహేష్‌తో పాటు అతడి వాహనంలో సంచరిస్తూ ఫోన్‌ కాల్స్‌ ద్వారా ఐపీఎల్‌ మ్యాచ్‌ల బెట్టింగ్స్‌ అంగీకరిస్తున్నారు. కాల్‌ కనెక్టర్‌కు వచ్చే ప్రతి కాల్‌ను రికార్డు చేసుకుంటున్నారు. తెలిసిన వారు, వారి సిఫార్సుతో వచ్చిన వారిని మాత్రమే పంటర్లుగా అంగీకరిస్తున్నారు.  
  • పందాల నిర్వహణలో క్రెడిట్‌ సౌకర్యాన్నీ కల్పించేవాడు. ఇతడి పంటర్లు వారం రోజుల పాటు ఎలాంటి మొత్తం చెల్లించకుండా బెట్టింగ్‌లో పాల్గొనవచ్చు. ఆపై అకౌంటెంట్‌ లెక్కలు చూస్తాడు. దాని ప్రకారం డబ్బు తీసుకోవడమో, చెల్లించడమో ఏజెంట్ల ద్వారా చేస్తుంటాడు.  
  • ఇతడి ముఠాపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.రఘునాథ్, ఎస్సైలు సీహెచ్‌.నవీన్‌ కుమార్, ఎస్‌.సాయి కిరణ్‌  రామ్‌గోపాల్‌పేట పోలీసులతో కలిసి వలపన్నారు.  
  • సింథికాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌ సమీపంలో మహేష్, అతడి కుమారుడు జతిన్‌లతో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.4.5 లక్షల నగదు, వాహనం తదితరాలు స్వాధీనం చేసుకున్నారు.   

(చదవండి: క్రికెట్‌ బెట్టింగ్‌ డాన్‌ అమిత్‌ను అరెస్ట్‌ చేసిన హైదరాబాద్‌ పోలీసులు)

మరిన్ని వార్తలు