అయ్యో కొడుకా.. ఎంత పనాయె..!

16 Dec, 2020 09:10 IST|Sakshi
గోదావరిలో గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్న సీఐ 

సెలవుపై సొంతూరుకు వచ్చిన ఆర్మీ జవాన్‌

సరదాగా స్నేహితులతో కలిసి గోదావరిలోకి

నాటుపడవ బోల్తా పడి దుర్మరణం

సాక్షి, కోటపల్లి(ఆదిలాబాద్‌) : అయ్యో కొడుకా ఎంత పనాయే.. సెలవులకు రాకున్నా బతికేటోడివి. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటావనుకుంటే అంతలోనే కన్నుమూశావా కొడుకా.. అంటూ ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సరదాగా స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు గోదావరిలోకి వెళ్లి నాటు పడవ మునిగి చెన్నూర్‌ పట్టణానికి ఆర్మీ జవాన్‌ రాజ్‌కుమార్‌ మృతి చెందిన విషయం తెల్సిందే. పట్టణానికి చెందిన గుండమీది రాజన్న, సునీత దంపతులకు కుమారుడు రాజ్‌కుమార్, కుమార్తె ఉన్నారు. రాజ్‌కుమార్‌ను తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. ఉన్నత చదువులు చదివిన రాజ్‌కుమార్‌ 2017లో ఆర్మీలో ఉద్యోగం సాధించి.. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని లేహ్‌ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజ్‌కుమార్‌కు సెలవులు మంజూరుకాగా.. మూడురోజుల క్రితం ఇంటికొచ్చాడు. సోమవారం ఉదయం స్నేహితులతో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి మండలంలోని ఎర్రాయిపేట గోదావరినదిలో నాటుపడవ మునిగి మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. హోటల్‌లో దినసరి కూలీగా పనిచేసే రాజన్న తన కుమారుడిని కష్టపడి చదివించిన ప్రయోజకుడిగా చూద్దామన్న కల నెరవేరకుండా పోయింది. 

నదితీరం వద్దే ప్రశాంత్‌ తల్లిదండ్రులు
చెన్నూర్‌కే చెందిన బండి శంకర్, రాజేశ్వరికి ఇద్దరు కుమారులు. ప్రశాంత్‌ డ్రైవింగ్‌ చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. సోమవారం ఉదయం గోదావరిలో స్నానం చేద్దామని స్నేహితులతో కలిసి వెళ్లాడు. నాటుపడవ మునగడంతో ప్రశాంత్‌ గల్లంతయ్యాడు. అతడి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. కొడుకు ఇంటి నుంచి వెళ్లి రెండు రోజులు గడిచినా ఇంతవరకు జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు గోదావరి వద్దే నిరీక్షిస్తూ.. ‘ఎప్పుడొస్తావు కొడుకా..’ అంటూ ఏడుస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది. మంగళవారం రాత్రి వరకూ గోదావరిలో కొడుకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు గోదావరి నది వద్దే వేచిచూస్తున్నారు.

ఆరుగురు స్నేహితులు కలిసి సోమవారం నాటుపడవలో గోదావరిలో ఈతకొట్టేందుకు బయల్దేరి సగం దూరం వెళ్లగానే ప్రమాదవశాత్తు బోల్తాపడింది. వీరిలో నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరగా.. రాజ్‌కుమార్, ప్రశాంత్‌ గల్లంతయ్యారు. సంఘటన జరిగిన గంట తర్వాత బండి శ్రీనివాస్‌ అనే యువకుడు తన తండ్రి శంకర్‌కు ఫోన్‌లో విషయం చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ నాగరాజ్‌ సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో సోమవారం నుంచి మంగళవారం వరకూ గాలింపు చర్యలు చేపట్టగా.. రాజ్‌కుమార్‌ మృతదేహం లభించింది. ప్రశాంత్‌ జాడ మాత్రం ఇంకా తెలియడం లేదు.

మరిన్ని వార్తలు