రెండ్రోజుల్లో యువకుడు వివాహం.. పెళ్లి పత్రికలు పంచుతూ..

19 May, 2022 12:49 IST|Sakshi
మృతుడు రమేష్‌(ఫైల్‌)

సాక్షి, మంచిర్యాల: మరో రెండ్రోజుల్లో ఆ యువకుడు పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. భాగస్వామితో కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్న కలలు కల్లలయ్యాయి. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కాసిపేట మండలం సోమగూడెం వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో నెన్నెల మండలం చిన్నలంబాడితండాకు చెందిన దరావత్‌ రమేష్‌(23) మృతిచెందాడు. సోమవారం ఎస్సై నరేష్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

నెన్నెల మండలం చిన్నలంబాడితండాకు చెందిన దరావత్‌ రమేష్‌ పెళ్లి ఈ నెల 20న జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు పంచడానికి మోటార్‌సైకిల్‌పై వెళ్లాడు. సోమగూడెంలో తమ బంధువులకు పత్రికలు పంచి తిరిగి మోటార్‌సైకిల్‌పై నెన్నెలకు బయల్దేరాడు. కాసిపేట మండలం పెద్దనపల్లి శివారులో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో రమేష్‌ అక్కడికక్కడే చనిపోయాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.
చదవండి: రేకుల ఇంటికి ఏడు లక్షల రూపాయల కరెంట్ బిల్లు.. అసలు విషయమిదే!

మరిన్ని వార్తలు