మణిపూర్‌లో AFSPA చట్టం పొడిగింపు.. 'కల్లోలిత ప్రాంతం'గా ప్రకటన..

27 Sep, 2023 18:48 IST|Sakshi

ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థుల హత్య వెలుగులోకి రావడంతో మరోసారి అక్కడ హింసాత్మక వాతావరణం నెలకొంది. విద్యార్థుల మృతికి నిరసనగా పెద్దఎత్తున విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్టోబర్ 1 వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టాన్ని (AFSPA) మరో ఆరు నెలల పాటు పొడిగించింది. 

మళ్ళీ మొదలు.. 
మే 3న మొదలైన అల్లర్లకు మణిపూర్ రాష్ట్రం నాలుగు నెలలుగా అట్టుడుకుతూనే ఉంది. ఇప్పటికీ ఒక్కో దారుణం వెలుగులోకి వస్తుండటంతో అక్కడ వాతావరణం చల్లారినట్టే చల్లారి అంతలోనే మళ్ళీ అల్లర్లు చెలరేగుతున్నాయి. కొన్నాళ్ల క్రితం ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించిన వీడియో ఎలాంటి పరిణామాలను సృష్టించిందో తాజాగా ఇద్దరు విద్యార్థుల మృతదేహాల ఫోటోలు వెలుగులోకి రావడంతో మళ్ళీ అలాంటి ఉద్రిక్తతే నెలకొంది. 

విద్యార్ధులపై లాఠీ.. 
ఇద్దరు విద్యార్థుల మృతదేహాల ఫోటోలు ఒక్కసారిగా ఇంటర్నెట్లో వైరల్ కావడంతో విద్యార్థులంతా ఇంఫాల్ వీధుల్లో నిరసనలకు దిగారు. ముఖ్యమంత్రి నివాసానికి దగ్గర్లోని కంగ్లా కోట సమీపంలో నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు విద్యార్థులను చెదరగొట్టేందుకు లాఠీలకు పనిచెప్పారు. పోలీసుల దాడిలో సుమారు 45 మంది విద్యార్థినీ విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

  

కల్లోలిత ప్రాంతం.. 
మణిపూర్ అల్లర్లు జరిగి ఐదు నెలల తర్వాత సెప్టెంబర్ 23న మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించిన ప్రభుత్వం తిరిగి మంగళవారం నుండి మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిషేధించింది. పదేపదే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. ఇంఫాల్ లోయ వద్ద 19 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాన్ని మినహాయించి మిగతా రాష్ట్రమంతా కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. అదేవిధంగా సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల అఫ్‌స్పా చట్టాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది. సీఎం బైరెన్ సింగ్ ఇద్దరు విద్యార్థుల కేసులో దర్యాప్తుకు సీబీఐని ఆదేశించారు.   

ఇది కూడా చదవండి: కావేరీ జలాలపై సుప్రీం కోర్టులో సవాల్ చేస్తాం: సిద్దరామయ్య  

మరిన్ని వార్తలు