మావోయిస్టు కీలకనేత రైనో అరెస్ట్‌

23 Feb, 2023 03:44 IST|Sakshi
శ్రీనుబాబు (ఫైల్‌)

సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామ­రాజు జిల్లా): మావో­యిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు (డీసీఎం) జనుమూరి శ్రీనుబాబు అలియాస్‌ సునీల్‌ అలియాస్‌ రైనోను ఏవోబీలో అరెస్ట్‌ చేశామని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీలేరు పోలీసు స్టేషన్‌ పరిధి, ఆంధ్ర, ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టు­లకు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల సమయంలో రైనోను అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు.

రైనో ఏవోబీ టెక్నికల్‌ టీమ్‌లో, సీఆర్‌సీ 3వ కంపెనీలో కమాండర్‌గా, మావోయిస్టు నేత ఆర్‌కేకు ప్రొటెక్షన్‌ స్క్వాడ్‌ కమాండర్‌గా, ఏవోబీలో మిలిటరీ ప్లటూన్‌ కమాండర్‌గా వివిధ హోదాల్లో పనిచేశాడని తెలిపారు. 2018­లో అప్పటి అరకు ఎమ్మె­ల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేల హత్యకేసులోనూ రైనో ప్రధాన నిందితుడని పేర్కొన్నారు.

ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టుగా పోలీసుశాఖ రికార్డుల్లో ఉన్నా­డని తెలిపారు. అరెస్టయిన శ్రీనుబాబు అలియాస్‌ రైనోపై ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డును గతంలో ప్రకటించిందని పేర్కొన్నారు. రైనోను న్యాయస్థానంలో హాజరుపరిచామని ఎస్పీ తెలిపారు. 

మరిన్ని వార్తలు