మావోయిస్టుల ఊచకోత.. 25 మంది హత్య

8 Oct, 2020 20:39 IST|Sakshi

బస్తర్‌ : ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. ఏకంగా 25 మంది గిరిజనులు హతమార్చి ఊచకోతకు పాల్పడ్డారు. ఈ మేరకు మావోయిస్ట్‌ పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో పోలీస్‌ అధికారులు నియమించిన 12 మంది రహస్య ఏజెంట్లను, ఐదుగురు కోవర్టులు, 8 మంది ఇన్‌ఫార్మర్‌లను ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల మద్దతుతో ప్రజా కోర్టులో శిక్షించామని పేర్కొంది. ఉద్యమ ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు, విప్లవోద్యమాన్ని కాపాడేందుకు ఈ చర్యకు ఉపక్రమించామని తెలిపింది. ఈ ఘటనకు బస్తర్‌ పోలీస్‌ ఐజీ సుందర్‌ రాజ్‌, బీజాపూర్‌ ఎస్‌పీలే అని మావోయిస్ట్‌ పార్టీ తన ప్రకటన ద్వారా వెల్లడించింది. గతకొంతకాలంగా వీరు మావోయిస్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించింది. 

‘ఇటీవల కాలంలో ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు వస్తున్నారని, పోలీసులే బాంబులు పెట్టి అమాయకులు చంపి తమపై పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో 8 మంది పార్టీ నేతలను ఎన్‌కౌంటర్‌ చేశారు. కార్యకర్తలను హత్య చేశారు. డీజీపీలు, ఐజీలు హెలికాప్టర్లలతో తిరుగుతూ, కూంబింగ్‌ చేస్తూ ప్రజలను భయకంపితులకు గురిచేస్తున్నారు. ఈ పాశవిక దామనకాండను ఖండిస్తూ 25 మంది ఏజెంట్లను ప్రజాకోర్టులో శిక్షించాం’ అని  మావోయిస్ట్‌ పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ పేర్కొంది. 
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు